ఆన్‌లైన్‌లో స్కూళ్ల అడ్మిషన్ల వివరాలు

Details of school admissions in online - Sakshi

ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌

సాక్షి, అమరావతి: స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన రికార్డులను ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసి రిజిస్టర్‌ చేసేలా విద్యాశాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. వివరాలను పొందుపరచడం కోసం ప్రత్యేక పోర్టల్‌ను విద్యాశాఖ రూపొందించింది. ఈ పోర్టల్‌ లింకును అన్ని స్కూళ్లకు పంపింది.  

► ‘హెచ్‌టీటీపీఎస్‌://ఎస్‌సీహెచ్‌ఓఓఎల్‌ఈడీయూ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌/ఎస్‌ఐఎంఎస్‌20/’ లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి కూడా పలు సూచనలు అందించింది. కోవిడ్‌– 19 నివారణ సూచనలు పాటిస్తూ ప్రవేశాలు చేపట్టాలి. విద్యార్థులను పాఠశాలకు రప్పించరాదు.
► 2019–20లోని ఆయా తరగతుల విద్యార్థులను తదుపరి క్లాస్‌లోకి ప్రమోట్‌ చేసి వారి పేర్లు పాఠశాల అడ్మిషను రిజిష్టరులో నమోదు చేయాలి. ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7వ తరగతి చదివి ఉత్తీర్ణులైన విద్యార్ధులు తదనంతరం ఏ పాఠశాలల్లో చేరాలనుకుంటున్నారో వారి తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకుని ఆ ప్రకారం ప్రవేశాలు చేపట్టాలి.  6వ తరగతిలో ప్రవేశాలు సంబంధిత మండల విద్యాశాఖాధికారి, 8వ తరగతిలో ప్రవేశాలు సంబంధిత ఉప విద్యాశాఖాధికారి పర్యవేక్షించాలి.  తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే పాఠశాలలో చేర్చేందుకు వారి రికార్డు షీటు, బదిలీ సర్టిఫికెటు అడిగినట్లయితే ప్రధానోపాధ్యాయుడు విధిగా అందించాలి.
► విద్యార్థులను పాఠశాలలో చేర్చుకునేందుకు ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల రికార్డు షీటు, బదిలీ సర్టిఫికెట్ల విషయంలో నిర్బంధించకుండా విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోవాలి . ఒకవేళ విద్యార్థి రికార్డు షీటు, ట్రాన్స్ఫర్‌ సర్టిఫికెటు ఇవ్వలేకపోతే ఆ తదుపరి కాలక్రమంలో వాటిని సమర్పించమనాలి.
► వలస వెళ్లిన కుటుంబాల పిల్లలు, తిరిగి వచ్చిన కుటుంబాల పిల్లల విషయంలో ఐడెంటిటీ నిరూపణ తప్ప మరే విధమైన ధ్రువపత్రాలూ అవసరం లేదు. ప్రవేశాలు పూర్తి కాగానే ఎప్పటికప్పుడు నిర్దేశించిన చైల్డ్‌ ఇన్ఫో పోర్టల్‌లో నమోదు చేస్తుండాలి. 
► అన్ని యాజమాన్యాల స్కూళ్లు ఈ మార్గదర్శకాలను పాటించాలి. 
► పాఠశాలలు తెరుచుకోనందున విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఒక వాట్సాప్‌ గ్రూపును రూపొందించి రోజువారీ కార్యక్రమాలు, విద్యార్థుల అభ్యసన ప్రక్రియ, విద్యార్థుల మూల్యాంకనం, ప్రగతికి సంబంధించిన విషయాలు సమీక్షించుకోవాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top