Third Wave Action Plan: కోవిడ్‌ మందులు రెడీ

Covid-19 drugs ready in Andhra Pradesh - Sakshi

థర్డ్‌ వేవ్‌ వచ్చినా ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు

ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం

4.75 లక్షలకు పైగా రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల స్టాక్‌

13 లక్షల హోమ్‌ ఐసొలేషన్‌ కిట్లు సిద్ధం

అందుబాటులో పొసకొనజాల్‌ ఇంజెక్షన్లు

Third Wave Action Plan: ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్‌ తీవ్రత తగ్గినా.. సెకండ్‌ వేవ్‌ ఇంకా కొనసాగుతూనే ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు మూడో వేవ్‌ వస్తుందనే అంచనాలు ఉన్నాయని చెబుతున్నారు. భవిష్యత్‌ అంచనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా ముందస్తు చర్యలు చేపట్టింది. థర్డ్‌ వేవ్‌ తీవ్రంగా వచ్చినా సమర్థంగా ఎదుర్కొని రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. అవసరమైన భారీఎత్తున మందుల నిల్వల్ని సిద్ధం చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో విరుచుకుపడిన సెకండ్‌ వేవ్‌లో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల కోసం ఎంతగా ఇబ్బంది పడింది అందరికీ తెలిసిందే. ఒక్కో ఇంజెక్షన్‌ ధర రూ.4 వేలు కాగా.. బ్లాక్‌ మార్కెట్‌లో కొంతమంది రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ అమ్ముకున్నారు. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే భారీగా నిల్వలు ఉంచింది. మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ (మ్యుకర్‌ మైకోసిస్‌) మందుల విషయంలో భవిష్యత్‌లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. కోవిడ్‌కు సంబంధించిన అన్నిరకాల మందులను భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా స్టాకు పెంచారు. 

13 లక్షలకు పైగా హోం ఐసొలేషన్‌ కిట్లు
ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకునే వారి కోసం 13 లక్షలకు పైగా హోం ఐసొలేషన్‌ కిట్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఒక్కో జిల్లాలో సగటున లక్ష కిట్లను రెడీగా ఉంచింది. మరోవైపు ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన యుద్ధప్రాతిపదికన కొనసాగుతూనే ఉంది. పడకలు, ఆక్సిజన్‌ పైప్‌లైన్లు, ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు వంటివన్నీ భారీగా సిద్ధం చేస్తోంది. కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ లో చేర్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే. అత్యంత ఖరీదైన బ్లాక్‌ఫంగస్‌ జబ్బునూ ఆరోగ్యశ్రీలో చేర్చి వేలాది రోగులకు ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం చేయగలిగింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top