రాష్ట్రంలో ముమ్మరంగా వ్యాక్సినేషన్‌

Corona Vaccination In full swing in AP - Sakshi

24.34 లక్షల మందికి తొలి డోస్‌

రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారు 3.84 లక్షల మంది

ముమ్మరంగా సాగుతున్న కార్యక్రమం

పరిషత్‌ ఎన్నికలు పూర్తికాగానే పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్‌

వారానికి 20 లక్షల నుంచి 25 లక్షల మందికి టీకా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ముమ్మరంగా కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నెల 2 వరకు రాష్ట్రంలో 24.34 లక్షల మందికి తొలి డోస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు. అలాగే 3.84 లక్షల మంది రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఓవైపు హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు.. మరోవైపు 60 ఏళ్లు దాటిన వారికి, 45 నుంచి 59 ఏళ్లలోపు వారికి సమాంతరంగా వ్యాక్సిన్‌ వేస్తున్నారు. వార్డు సచివాలయాలు కేంద్రంగా ఈ కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రతి మండలంలో వారంలో నాలుగు రోజులు, రోజుకు రెండు గ్రామాల చొప్పున వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. కాగా.. హెల్త్‌కేర్‌ వర్కర్లకు జనవరి 16న తొలి డోస్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించగా.. రెండో డోస్‌ ఫిబ్రవరి 13న ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఫిబ్రవరి 3న తొలి డోస్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించగా.. రెండో డోస్‌ను మార్చి 3 నుంచి ఇస్తున్నారు.

పరిషత్‌ ఎన్నికలు పూర్తి కాగానే..
జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు ఈ నెల 10న పూర్తి కాగానే మరుసటి రోజు నుంచి అధికార యంత్రాంగమంతా వ్యాక్సినేషన్‌పైనే దృష్టిసారించనుంది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు, ఆశా, హెల్త్‌కేర్‌ వర్కర్లు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో వారానికి 20 లక్షల నుంచి 25 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పీహెచ్‌సీ డాక్టర్‌ పర్యవేక్షణలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపడతారు. ముందు జాగ్రత్తగా 104, 108 అంబులెన్స్‌లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకోవడంపై విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం గురించి ప్రతి ఇంటికీ వెళ్లి వివరిస్తున్నారు. 

ఈ నెల 2 వరకు రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ వివరాలు ఇలా..
► తొలి డోస్‌ వేయించుకున్నవారు: 24,34,760 మంది
► రెండో డోస్‌ వేయించుకున్నవారు: 3,84,626 మంది
► తొలి డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న హెల్త్‌కేర్‌ వర్కర్లు: 3,77,477 మంది
► రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న హెల్త్‌కేర్‌ వర్కర్లు: 2,26,080 మంది
► తొలి డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు: 4,15,895 మంది
► రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు: 1,51,356
► 60 ఏళ్ల పైబడిన వారిలో తొలి డోస్‌: 10,36,321 మందికి
► 60 ఏళ్ల పైబడిన వారిలో రెండో డోస్‌: 4,883 మందికి
► 45 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వారిలో తొలి డోస్‌: 6,05,067 మందికి
► 45 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వారిలో రెండో డోస్‌: 2,307 మందికి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top