భూమి పూజ తరువాత పనుల్లో జాప్యం చేయొద్దు

CM Jagan Review On Pulivendula Area Development Authority - Sakshi

అధికార యంత్రాంగానికి సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

వీలైనంత త్వరగా ప్రారంభించి గడువులోగా పూర్తి చేయాలి

నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దు 

పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష సమావేశం

సాక్షి, అమరావతి: ఎక్కడైనా, ఏ పనైనా భూమి పూజ (శంకుస్థాపన) చేసిన తరువాత వీలైనంత త్వరగా పనులు ప్రారంభం కావాలని, ఏమాత్రం జాప్యం జరగకూడదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (పాడా)పై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం..
సాగు నీటి కింద మంజూరైన వివిధ పనులకు జ్యుడిషియల్‌ ప్రివ్యూ వేగంగా పూర్తి చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలి. ముద్దనూరు–కొడికొండ చెక్‌పోస్టు రహదారి చాలా కీలకం. నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాతీయ రహదారి మాదిరిగా ముద్దనూరు–కొడికొండ చెక్‌పోస్టు రహదారిని నిర్మించాలి. పులివెందులలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్, సిటీ సెంటర్, సెంట్రల్‌ బోలీవార్డు, స్లాటర్‌ హౌస్‌ల నిర్మాణం జరగాలి. అన్ని లేఅవుట్లలో నీటి సరఫరాతో పాటు సీవరేజ్‌ పనులు చేపట్టాలి. రింగ్‌ రోడ్‌ను మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలి. చేపట్టిన ఏ పని అయినా దీర్ఘకాలం ఉండేలా చేయాలి. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. 

ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు
► వేంపల్లిలో రూ.92 కోట్లతో భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) పనులకు ఆమోదం
► పనులు మొత్తం ఒకేసారి మొదలు పెట్టకుండా దశల వారీగా చేయాలి. అంతటా ఒకేసారి గుంతలు తవ్వి పనులు చేపడితే పూర్తయ్యేసరికి చాలా సమయం పడుతుంది. 
► ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక దగ్గర పని ప్రారంభించి అది పూర్తయ్యాక మరో దశకు వెళ్లాలి. 

ఆలయాలు–అభివృద్ధి
► గండి వీరాంజనేయస్వామి ఆలయంలో రూ.21 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలి. 
► 24 దేవాలయాల పునర్నిర్మాణంతో పాటు కొత్తగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 26 ఆలయాల నిర్మాణం చేపట్టాలి. తొండూరులో బాలికల బీసీ గురుకుల పాఠశాల, పులివెందుల, వేంపల్లెలో రైతు బజార్లు, పులివెందులలో క్రికెట్‌ స్టేడియం నిర్మాణం, కడప క్రికెట్‌ స్టేడియంలో ఫ్లడ్‌ లైటింగ్‌ పనులకు శ్రీకారం చుట్టాలి. కడప రైల్వే స్టేషన్, రిమ్స్‌ రోడ్ల అభివృద్ధితోపాటు నగరంలో అత్యంత ప్రధానమైన నాలుగు రహదారులను రూ.217 కోట్లతో తొలి దశలో అభివృద్ధి చేయాలి. కడప విమానాశ్రయంలో రాత్రిపూట విమానాలు దిగేలా రన్‌వే విస్తరణకు 47 ఎకరాలను సేకరించి ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించాలి. 

బుగ్గవంక ప్రొటెక్షన్‌ వాల్‌ పూర్తి కావాలి..
బుగ్గవంక ప్రాంతంలో 10 కి.మీ ప్రొటెక్షన్‌ వాల్‌కుగానూ వైఎస్సార్‌ హయాంలో 7 కి.మీ పూర్తి చేశారు. మిగిలిన 3 కి.మీ ప్రొటెక్షన్‌ వాల్‌ నిర్మాణంతో పాటు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థకు అదనంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నాం. పులివెందులలోని ఏపీ–కార్ల్‌ సంస్థలో ఇర్మా–ఏపీ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆనంద్‌–ఏపీ) ఏర్పాటుకు ఈనెల 24న శిలా ఫలకం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.

పులివెందులను మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దాలి..
పులివెందుల, మైదుకూరు, కమలాపురం, రాయచోటి నియోజకవర్గాలతో పాటు కడపలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల గురించి సమావేశంలో అధికారులు వివరించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో తొలిసారిగా పూర్తిస్థాయిలో 10.14 టీఎంసీల నీరు నిల్వ చేసినట్లు తెలిపారు. ‘ఈఏపీ’ ద్వారా గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.184 కోట్లతో 76 రహదారులకు టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పారు. అన్ని రంగాలలో పనులు చేపడుతూ దశలవారీగా పులివెందులను మోడల్‌ టౌన్‌గా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top