టెస్ట్‌లతోనే కట్టడి

Andhra Pradesh performing corona diagnostic tests at record levels - Sakshi

రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఏపీ  

ఇప్పటికే 16.86 లక్షలు దాటిన టెస్ట్‌లు

ఎక్కువగా పాజిటివ్‌ కేసులున్న క్లస్టర్లలోనే 90% టెస్ట్‌లు

కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా ఇదే సరైన మార్గం అంటున్న నిపుణులు, ఐసీఎంఆర్‌

రాష్ట్రంలో లక్ష కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ

పాజిటివిటీ 6 శాతం, జాతీయ సగటు 8 శాతం

మరణాల రేటు ఒక్కశాతమే.. జాతీయ సగటు 2 శాతం

సాక్షి, అమరావతి: అత్యధికంగా టెస్ట్‌లను నిర్వహించడం ద్వారా కోవిడ్‌–19 వ్యాప్తిని నిరోధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రికార్డు స్థాయిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. ఇప్పటికే 16.86 లక్షలకు పైగా టెస్ట్‌లు నిర్వహించగా, ఇందులో లక్ష కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. 6.07 శాతం పాజిటివిటీ రేటు, 1.06 శాతం మరణాల రేటు నమోదైంది. పాజిటివిటీలో జాతీయ సగటు 8.54 శాతం, మరణాల రేటు 2.28 శాతం ఉంది. రాష్ట్రంలో ఎక్కువగా పాజిటివ్‌ కేసులున్న క్లస్టర్లలోనే 90 శాతం టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఈ దృష్ట్యా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా, ఇదే సరైన మార్గం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐసీఎంఆర్‌ కూడా ఇదే చెబుతోంది. 

– తాజా గణాంకాల ప్రకారం 929 వెరీ యాక్టివ్‌ క్లస్టర్లలో అత్యధికంగా టెస్టులు నిర్వహిస్తున్నారు. మరో 446 యాక్టివ్‌ క్లస్టర్లలోనూ టెస్టుల సంఖ్య భారీగా పెంచారు. ఇక్కడ ఎక్కువ మందిని గుర్తిస్తే వారి నుంచి ఇతరులకు వ్యాప్తి కాకుండా నివారించడానికి వీలుంటుంది.
– సోమవారం నాటికి 16.86 లక్షల పైచిలుకు టెస్టులు చేయగా 1.02 లక్షల కేసులు నమోదయ్యాయి. పది లక్షల జనాభాకు 31,581 పరీక్షలు నిర్వహించారు.  
– కేవలం పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిన విషయాన్ని చూడకుండా, మిగతా పెరామీటర్లను పరిగణనలోకి తీసుకుంటే.. కోవిడ్‌ నియంత్రణలో రాష్ట్రం ఎంతో సమర్థవంతంగా వ్యవహరిస్తోందన్న విషయం స్పష్టమవుతుందని అధికారులు వివరిస్తున్నారు. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని చెబుతున్నారు. 

ఐసీఎంఆర్‌ చెప్పిందీ ఇదే..
– దేశంలో జనాభా ప్రాతిపదికన ఏ రాష్ట్రమూ చేయనన్ని టెస్టులు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే. ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌) మార్గదర్శకాలు కూడా ఇవే. కంటైన్మెంట్‌ జోన్లలో ఎక్కువ టెస్టులు చేయడం, అక్కడ ఎక్కువ కేసులు నమోదు కావడంతో ఎక్కువ మందిని ఐసొలేట్‌ (చికిత్స లేదా క్వారంటైన్‌) చేయ గలుగుతున్నారు. 
– రాష్ట్రంలో రోజుకు 90 టెస్టులు చేసే దశ నుంచి 50 వేల టెస్టులకు పైగా చేసే స్థితికి చేరుకున్నదంటేనే కరోనా నియింత్రణలో ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. తక్కువ టెస్టులు చేయడం వల్ల తక్కువ కేసులు నమోదవ్వచ్చుగానీ, సకాలంలో నిర్ధారణ చేయకపోతే అత్యంత ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. 
– ఈ రోజు లక్ష మందిని పాజిటివ్‌గా గుర్తించామంటే వీరందరి ద్వారా లక్షలాది మందికి వైరస్‌ వ్యాప్తి చెందకుండా నివారిస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికారులు చెబుతున్నారు. దీనికి తగ్గట్టు ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెంచుకుంటూ.. మరింతగా నిర్ధారణ పరీక్షలు ఎక్కువ చేయడమే సరైన వ్యూహం అని ఉన్నతాధికారులు స్పష్టీకరిస్తున్నారు. 

టెస్ట్‌లకే రోజుకు రూ.5 కోట్లు  
– రాష్ట్రంలో కరోనా కేసులు నమోదయ్యే నాటికి తిరుపతిలో ఒకే ఒక్క ల్యాబొరేటరీ ఉండేది. అప్పట్లో కొన్ని చోట్ల మాత్రమే నమూనాలు సేకరించారు. రోజుకు కేవలం 90 పరీక్షలు చేసే సామర్థ్యం మాత్రమే ఉండేది. అలాంటిది నేటికి ఆ సంఖ్య 14కు పెరిగింది. 
– వివిధ కూడళ్లలో 50కి పైగా బస్సులు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా శాంపిళ్లు సేకరించారు. 
– నియోజక వర్గ కేంద్రాల్లోనే ట్రూనాట్‌ మెషీన్ల ద్వారా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తాజాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో యాంటీజెన్‌ టెస్టుల ద్వారా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. 
– ఎక్కువ కేసులు వస్తాయనుకున్న కూడళ్లు, బస్టాండులు, రైల్వేస్టేషన్‌లు వంటి అన్ని ప్రాంతాల్లో నమూనాల సేకరణ ముమ్మరంగా సాగుతోంది. రోజుకు రూ.5 కోట్లు పైనే టెస్టులకు వ్యయం చేస్తున్నారు. 

పొరుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి
– కర్ణాటకలో ఇప్పటి వరకు 11.76 లక్షల టెస్టులు చేయగా, 96,141 కేసులు నమోదయ్యాయి. 8.17 శాతం పాజిటివిటీ రేటు ఉంది.
– తెలంగాణలో 3.53 లక్షల టెస్టులు చేయగా, 54 వేల పైచిలుకు కేసులతో పాజిటివిటీ రేటు 15.30 శాతంగా నమోదైంది
– తమిళనాడులో 23.51 లక్షలు టెస్టులు చేయగా, 2.13 లక్షల పైచిలుకు పాజిటివ్‌ కేసులు నమోదై 9.09 శాతం పాజిటివిటి నమోదైంది.
– గుజరాత్‌లో ఇప్పటి వరకు చేసింది 6.42 లక్షల టెస్టులు మాత్రమే. కానీ 56 వేల కేసులతో 8.69 శాతం పాజిటివిటీ నమోదైంది. 
– ఏపీలో సోమవారం నాటికి 16.86 లక్షల పైచిలుకు టెస్టులు చేయగా 1.02 లక్షల కేసులతో 6.02 శాతం పాజిటివిటీ రేటు ఉంది
– ఈ లెక్కన మనకంటే తక్కువ టెస్టులు చేసిన రాష్ట్రాల్లో మనకంటే ఎక్కువ పాజిటివిటీ ఉన్నట్టు స్పష్టమైంది. ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ టెస్టులు చేస్తే మనకంటే రెట్టింపు కేసులు ఉంటాయని తెలుస్తోంది. 

ఎన్ని కేసులు అన్నది కాదు..
ఇప్పుడు కేసుల గురించి పట్టించుకోలేం. ఎక్కువ మందికి టెస్టులు చేసి పాజిటివ్‌ వారిని గుర్తించి నియంత్రించాలి. లేదంటే వారి నుంచి ఎక్కువగా వ్యాప్తి చెంది మరింత మందికి ఇబ్బంది అవుతుంది. టెస్టులు చేయకపోతే వైరస్‌ సోకిన వ్యక్తి ఎంత మందికి వ్యాప్తి చేస్తాడో తెలియదు కదా?
– డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, వైద్య ఆరోగ్య శాఖ

ఇదే సరైన వ్యూహం
చాలా రాష్ట్రాలు తక్కువ టెస్టులు చేసినా ఎక్కువ కేసులు వచ్చాయి. ఇప్పుడు కేసులు తక్కువ చూపించుకోవచ్చు. ఉధృతం అయ్యాక అప్పడు సాధ్యం కాదు. అందుకే మనం అంచనాకు మించి టెస్టులు చేస్తున్నాం. మన రాష్ట్రం అనుసరిస్తున్న వ్యూహం సరైనది.
– డా.రాంబాబు, నోడల్‌ అధికారి, రాష్ట్ర కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

వైరస్‌ ఉందో లేదో తెలిస్తేనే కదా..
ముందు ఒంట్లో వైరస్‌ ఉందో లేదో తెలుసుకోవాలి. చాలా రాష్ట్రాల్లో టెస్టులు అందుబాటులో లేక ఎక్స్‌రే, సీటీస్కాన్‌ను ఆశ్రయిస్తున్నారు. అప్పటికే ఇన్ఫెక్షన్‌ ఎక్కువై మృతి చెందుతున్నారు. దీనికంటే ఎక్కువ టెస్టులు చేసి ముందే బాధితులను గుర్తిస్తే వారి నుంచి ఇతరులకు వ్యాప్తి కాకుండా ఉంటుంది.
– డా.నీలిమ, కమ్యూనిటీ మెడిసిన్‌ నిపుణులు, వైద్య విద్యా శాఖ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top