ఎగుమతుల్లో మరోసారి సత్తా చాటిన ఏపీ

Andhra Pradesh is once again strong in exports - Sakshi

సంసిద్ధత సూచీ 2021లో 11 స్థానాలు మెరుగుపర్చుకున్న రాష్ట్రం

20వ స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి ఎగబాకిన ఆంధ్రప్రదేశ్‌

ఎగుమతుల వృద్ధిలో రెండో స్థానం.. గుజరాత్‌ తర్వాత మనమే

2021 నివేదికను విడుదల చేసిన నీతి ఆయోగ్‌ 

సాక్షి, అమరావతి: ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి సత్తా చాటింది. నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన ఎగుమతుల సంసిద్ధత సూచీ–2021లో మెరుగైన పనితీరుతో ప్రతిభ కనపరిచింది. 2020లో 20వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 2021లో 9వ స్థానానికి ఎగబాకినట్లు నీతి ఆయోగ్‌ వెల్లడించింది. గతంలో 35.38 పాయింట్లతో 20వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ తాజాగా 50.39 పాయింట్లు సాధించడం ద్వారా 9వ స్థానానికి చేరుకుంది. కోస్తాతీరం కలిగిన రాష్ట్రాల్లో 2020లో ఏడో స్థానంలో నిలిచిన ఏపీ తాజా నివేదికలో 5వ స్థానాన్ని సాధించింది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించడం, వాణిజ్య ఉత్సవాలు, సదస్సుల నిర్వహణతోపాటు మెరుగైన విధానాల రూపకల్పనలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఎంతో చొరవ చూపారు.  

అనుకూల రాష్ట్రం ఏపీ
ఎగుమతుల ప్రోత్సాహక పాలసీ, వ్యాపార వాతావరణం, విభిన్న ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం ఉండటం, ఆర్‌అండ్‌ఆర్‌– మౌలిక వసతులు తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌ మంచి పనితీరు కనపరుస్తోందని నీతి ఆయోగ్‌ నివేదికలో పేర్కొంది. ఎగుమతులకు అనుకూల వాతావరణం కలిగిన రాష్ట్రాల్లో 10వ స్థానంలో, ఎగుమతుల వాణిజ్యంలో 8వ స్థానంలో ఏపీ నిలిచింది. ఇదే సమయంలో ఎగుమతుల వృద్ధిలో ఏపీ రెండో స్థానం సాధించగా గుజరాత్‌ మొదటి స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ ఎగుమతుల్లో 19 శాతం వృద్ధి నమోదు చేసినట్లు నీతిఆయోగ్‌ పేర్కొంది. అంతర్జాతీయంగా సముద్ర ఉత్పత్తులకు డిమాండ్‌ నెలకొనడం రాష్ట్రానికి కలసి వచ్చినట్లు విశ్లేషించింది.

మరోసారి గుజరాత్, మహారాష్ట్ర
దేశవ్యాప్తంగా ఎగుమతుల సంసిద్ధత ర్యాంకులను పరిశీలిస్తే గుజరాత్‌ 78.86 పాయింట్లతో మొదటి స్థానం, 77.14 పాయింట్లతో మహారాష్ట్ర రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. గతంలో తొమ్మిదవ స్థానంలో ఉన్న కర్ణాటక 61.72 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది. 35.38 పాయింట్లతో 20వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ తాజాగా 50.39 పాయింట్లు సాధించడం ద్వారా 9వ స్థానానికి చేరుకుంది. గతంలో 57.43 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్న తెలంగాణ తాజాగా 47.92 పాయింట్లకు పరిమితం కావడంతో 10వ స్థానానికి పడిపోయింది. 5, 6, 7, 8వ స్థానాల్లో నిలిచిన హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్‌లతో పోలిస్తే ఏపీ 1–2 పాయింట్ల  వ్యత్యాసంతో మాత్రమే పోటీలో ఉండడం గమనార్హం. 

పరిశ్రమల శాఖకు మంత్రి బుగ్గన అభినందన
నీతి ఆయోగ్‌ ప్రకటించిన ఎగుమతుల సంసిద్ధత సూచీ–2021లో రాష్ట్రం మెరుగైన స్థానంలో నిలవడంపై ఆర్థిక, పరిశ్రమల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సంతోషం వ్యక్తం చేశారు. పరిశ్రమల శాఖ కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సూచీలో ఆంధ్రప్రదేశ్‌ 11 స్థానాలు ఎగబాకడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికతకు నిదర్శనమన్నారు. 

రెట్టింపు ఎగుమతులు లక్ష్యం 
రాష్ట్ర ఎగుమతులు 2030 నాటికి రెట్టింపు కావాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ పేర్కొన్నారు. దేశ ఎగుమతుల్లో 10 శాతం వాటా సాధించాలన్న లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ  ఎగుమతుల సంసిద్ధత సూచీలో ఏపీ మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. స్థానిక ఉత్పత్తులకు బ్రాండింగ్‌ సృష్టిస్తూ ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా ర్యాంకును మెరుగుపరచుకున్నట్లు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top