బదిలీల నిలుపుదలకు హైకోర్టు ‘నో’

Andhra Pradesh High Court questioning medical students - Sakshi

వైద్య ఉద్యోగులను బదిలీచేసే అధికారం ప్రభుత్వానికుంది

అందులో మేమెలా జోక్యం చేసుకుంటాం?.. 

బదిలీలపై అభ్యంతరం ఉంటే ప్రొఫెసర్లు కోర్టుకు రావాలి

వారి తరఫున మీరెలా పిటిషన్‌ వేస్తారు?

వైద్య విద్యార్థులను ప్రశ్నించిన హైకోర్టు

కౌంటర్ల దాఖలుకు ప్రభుత్వానికి, జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌కు నోటీసులు 

సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ వాదన వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని స్పష్టంచేసింది. ఈ శాఖలో ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు తదితరుల బదిలీల వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్య డైరెక్టర్, జాతీయ మెడికల్‌ కమిషన్‌ చైర్మన్‌కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు తదితరుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కర్నూలు మెడికల్‌ కాలేజీకి చెందిన పలువురు పీజీ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ కృష్ణమోహన్‌ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది జి. అరుణ్‌శౌరి వాదనలు వినిపిస్తూ.. ఈ బదిలీలవల్ల పీజీ వైద్య విద్యార్థుల చదువులు తీవ్రంగా ప్రభావితం అవుతాయన్నారు. కొన్నేళ్లుగా విద్యార్థులు ప్రొఫెసర్లతో బోధనా, వృత్తిపరమైన సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారని, ఇప్పుడు వారిని బదిలీ చేయడంవల్ల విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందన్నారు.

ప్రొఫెసర్ల తరఫున మీరెలా పిటిషన్‌ వేస్తారు?
ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. ఉద్యోగులను బదిలీచేసే హక్కు, అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. అది ప్రభుత్వ విధాన నిర్ణయమని తెలిపారు. అందులో న్యాయస్థానాలు ఎలా జోక్యం చేసుకుంటాయని ప్రశ్నించారు. అలాగే, బదిలీలపై అభ్యంతరం ఉంటే వాటివల్ల ప్రభావితం అవుతున్న ప్రొఫెసర్లు కోర్టుకు రావాలే తప్ప విద్యార్థులు ఎలా పిటిషన్‌ వేస్తారని ప్రశ్నించారు. ఇలాంటి వాటిని అనుమతించేది లేదన్నారు. దీంతో పిటిషనర్ల తరఫు న్యాయవాది స్పందిస్తూ.. బదిలీలవల్ల ప్రభావితం అవుతున్నారు కాబట్టే విద్యార్థులు ఈ పిటిషన్‌ వేశారని తెలిపారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీ చేయడంపై తాము ప్రధానంగా అభ్యంతరం చెబుతున్నామన్నారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉత్తర్వులున్నాయని తెలిపారు. వైద్య విద్యార్థులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దా ఖలు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు.   వ్యక్తులు ముఖ్యం కాదని, వ్యవస్థ ముఖ్యమన్నారు. 

చట్ట విరుద్ధమైతే జోక్యం చేసుకుంటాం
ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. బదిలీల మార్గదర్శకాలకు అనుగుణంగానే తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. బదిలీలపై విద్యార్థులు అభ్యంతరం చెప్పడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ప్రభుత్వానికి, జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌కు నోటీసులు జారీచేశారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలుకు ఆదేశాలిచ్చారు. ఈ సమయంలో అరుణ్‌ శౌరి మధ్యంతర ఉత్తర్వుల కోసం అభ్యర్థించగా.. అది సాధ్యంకాదని న్యాయమూర్తి చెప్పారు. కౌంటర్‌ను పరిశీలించిన తరువాత ప్రభుత్వ ఉత్తర్వులు చట్ట విరుద్ధమైతే అందులో జోక్యం చేసుకుంటామని చెప్పి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top