ఆ చట్టాన్ని మార్చే అధికారం అసెంబ్లీకి లేదు

Andhra Pradesh High Court Comments On Capital City - Sakshi

రాజధాని మార్చే అధికారం రాష్ట్రానికి లేదన్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం

రాజధానిని మరో చోటుకు మార్చే, ప్రధాన కార్యాలయాలు తరలించే అధికారమూ లేదు

ఆ అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉంది

రాజధాని మార్చాలనుకుంటే చట్ట సవరణ కోరవచ్చు

ఒప్పందాలకు అనుగుణంగా అమరావతిని అభివృద్ధి చేయాల్సిందే 

6 నెలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి.. 3 నెలల్లో రైతులకు ప్లాట్లు ఇవ్వాలి

రాజధాని భూములను ఇతర అవసరాలకు తాకట్టు పెట్టరాదు.. బదలాయించరాదు

ఇప్పటికే చేసిన ఖర్చుకు ప్రభుత్వానిదే బాధ్యత

ప్రభుత్వం మారినంత మాత్రాన గత ప్రాజెక్టులు ఆపడానికి వీల్లేదు

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు జీవనోపాధి కోల్పోయారు

ఇప్పుడు రాజధానిని అభివృద్ధి చేయక పోవడం వారి హక్కులను హరించడమే

సాక్షి, అమరావతి: రాజధాని వ్యవహారంలో హైకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. మూడు రాజధానుల ఏర్పాటు నిమిత్తం చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు లేదని తేల్చి చెప్పింది. రాజధాని నగరాన్ని మార్చే.. లేదా విభజించే.. లేదా మూడు రాజధానులుగా ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదని స్పష్టం చేసింది. హైకోర్టుతో సహా శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలను ఏపీ సీఆర్‌డీఏ చట్టం, ల్యాండ్‌ పూలింగ్‌ నిబంధనల కింద నోటిఫై చేసిన ప్రాంతంలో తప్ప మరో చోటుకు మార్చే అధికారం కూడా రాష్ట్రానికి లేదంది.

ఆ అధికారం పూర్తిగా పార్లమెంట్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఏపీ పునర్విభజన చట్టం తీసుకురావడం ద్వారా పార్లమెంట్‌ తన అధికారాన్ని ఉపయోగించిందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలతో పాటు ఆ చట్టాలను ఉప సంహరిస్తూ ఇటీవల తీసుకొచ్చిన చట్టం కూడా చట్ట విరుద్ధమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక వేళ రాష్ట్రం రాజధానిని మార్చాలనుకుంటే కేంద్రానికి లేదా పార్లమెంట్‌కు విజ్ఞప్తి చేసి, ఏపీ పునర్విభజన చట్టానికి సవరణ కోరవచ్చని చెప్పింది. 

ఒప్పందాలకు అనుగుణంగా సీఆర్‌డీఏ, ల్యాండ్‌ పూలింగ్‌ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని నిర్మించి, అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 58, ల్యాండ్‌ పూలింగ్‌ నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌ తదితర ప్రాథమిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏలకు హైకోర్టు తేల్చి చెప్పింది.

సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 61 ప్రకారం టౌన్‌ ప్లానింగ్‌ స్కీమ్‌లను పూర్తి చేయాలంది. రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలతో నివాస యోగ్యమైన రీతిలో ప్లాట్లను అభివృద్ధి చేసి, వాటిని మూడు నెలల్లో ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములు ఇచ్చిన భూ యజమానులకు అప్పగించాలని ఆదేశించింది. రాజ్యాంగంలోని షెడ్యూళ్లు 2, 3 ప్రకారం, ల్యాండ్‌ పూలింగ్‌ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏలు తమ బాధ్యతలను నిర్వర్తించాలని ఆదేశించింది. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పురోగతికి సంబంధించి అఫిడవిట్‌లు దాఖలు చేయాలని ప్రభుత్వం, సీఆర్‌డీఏలను ఆదేశించింది.

పాలనా వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు స్వతంత్ర కమిటీలు ఇచ్చిన నివేదికలను పిటిషనర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు సవాలు చేసుకోవచ్చని చెప్పింది. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపును నిరోధిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయంది. మాస్టర్‌ ప్లాన్‌ను సుమోటోగా సవరించే అధికారం సీఆర్‌డీఏకు లేదని చెబుతూ.. అలా చేసినందుకు సీఆర్‌డీఏకు జరిమానా విధించింది. ఒక్కో పిటిషన్‌లోని పిటిషనర్‌కు రూ.50 వేల చొప్పున కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాల నిమిత్తం పలు వ్యాజ్యాలను హైకోర్టు పెండింగ్‌లో ఉంచింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజుల త్రిసభ్య ధర్మాసనం 307 పేజీల తీర్పు వెలువరించింది.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై విచారణ జరుగుతుండగానే ఆ రెండు చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో సాధారణంగా ఆ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకమే కావాలి. కానీ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు మాత్రం తమ వ్యాజ్యాల్లో తాము లేవనెత్తిన పలు అభ్యర్థనల్లో కొన్ని మనుగడలో ఉంటాయని, వాటిని తేల్చాలని కోరారు. దీంతో త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యాల్లో ఏ ఏ అభ్యర్థనలు మనుగడలో ఉంటాయి? ఆ అభ్యర్థనల విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాలన్న అంశంపై సుదీర్ఘ వాదనలు వినింది. విచారణ సందర్భంగా ధర్మాసనం.. చట్టాలు చేయకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేమని, ఆ దిశగా ఎలాంటి వాదనలు అవసరం లేదని ఇరుపక్షాల న్యాయవాదులకు స్పష్టం చేసింది.

చట్టం చేసే విషయంలో ప్రభుత్వానికున్న అధికారం విషయాన్ని తాము తేల్చబోమని మౌఖికంగా తెలిపింది. చట్టాల చట్టబద్ధతను, ఆ చట్టాలు తెచ్చేందుకు అనుసరించిన నిర్ణాయక ప్రక్రియను మాత్రమే తేలుస్తామంది. రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలో కూడా తాము నిర్ణయించజాలమని ఇరుపక్షాల న్యాయవాదులకు స్పష్టం చేసింది. సుదీర్ఘ వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం గత నెల 4న తన తీర్పును రిజర్వ్‌ చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం తన తీర్పును వెలువరించింది. వాదనల సమయంలో చెప్పిన దానికి భిన్నంగా ధర్మాసనం గురువారం చట్టం చేసే విషయంలో ప్రభుత్వానికున్న అధికారంపై కూడా తీర్పు వెలువరించింది. చట్టం చేసే అధికారం రాష్ట్రానికి లేదని చెప్పడం ద్వారా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పరోక్షంగా చెప్పినట్లయింది. త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.

అది.. హక్కులను హరించడమే
ల్యాండ్‌ పూలింగ్‌ కింద రాజధాని నగర, రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం వ్యవసాయ భూములిచ్చి.. తమ జీవనోపాధిని త్యాగం చేసిన పేద భూ యజమానులకు, ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేసిన ప్లాట్లను అందజేయడంలో విఫలమైన శక్తిమంత ప్రభుత్వానికి మధ్య పోరాటమిది. ఈ పోరాటం అంతిమంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసేందుకు దారి తీసింది.
రాజధానికి సంబంధించిన అగ్రిమెంట్‌ కమ్‌ తిరిగి తీసుకోలేని జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ చట్టబద్ధ కాంట్రాక్ట్‌. దీనికి ఇరుపక్షాలు కూడా కట్టుబడి ఉండాల్సిందే. దీని ప్రకారం రాజధాని నగర, ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సీఆర్‌డీఏపై ఉంది.
ఒప్పందంలోని ఫాం 9.14లో సీఆర్‌డీఏ రూపొందించిన నిబంధనలన్నీ రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ఉన్న హక్కులను హరించే విధంగా ఉన్నాయి. రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చినప్పుడు నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన బా«ధ్యత సీఆర్‌డీఏపై ఉంది.
సీఆర్‌డీఏ తన బాధ్యతలను నిర్వర్తించకపోతే వాటిని పూర్తి చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఒప్పందం ప్రకారం రైతులు ఇచ్చిన భూముల్లో అభివృద్ధి చేపట్టకపోవడం వారి హక్కులను హరించడమే అవుతుంది.
అందుకే మా జోక్యం 
రాజధానిని అభివృద్ధి చేయకపోవడం ద్వారా ప్రభుత్వం, సీఆర్‌డీఏలు ఆ రైతుల ప్రాథమిక హక్కులను హరించినట్లయింది. ప్రభుత్వ చర్యలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నప్పుడు న్యాయస్థానాలు అందులో జోక్యం చేసుకోవచ్చు. ప్రస్తుత కేసులో రైతుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానంపై ఉంది.  
ప్రభుత్వం మారినంత మాత్రాన విధాన నిర్ణయం మారుతుందని చెప్పడానికి వీల్లేదు. గత ప్రభుత్వ నిర్ణయాలు చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే తప్ప, ఆ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన న్యాయ పరమైన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. 
గత ప్రభుత్వం రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రాథమిక పనుల నిమిత్తం రూ.32 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తాలన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలు, ఇతర కారణాలతో అభివృద్ధి కార్యక్రమాలు నిలిపేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. 
రాజధాని కోసం ఇప్పటి వరకు 28,526 మంది రైతుల నుంచి 34,385.27 ఎకరాలను పూలింగ్‌ కింద సేకరించారు. రైతులకు 64,709 ప్లాట్లు కేటాయించారు. అందులో 39,769 మందికి ప్లాట్లు రిజిస్టర్‌ చేశారు. అంతర్గతంగా కొన్ని రోడ్లు వేశారు. మంచినీటి పైపు లైన్ల నిర్మాణం పూర్తి కాలేదు. తుది నోటిఫికేషన్‌ జారీ చేయడం పూర్తి చేశారే తప్ప, చట్ట ప్రకారం చేయాల్సిన పనులన్నింటినీ పూర్తి చేయలేదు.
పథకాల కోసం రూ.కోటాను కోట్ల ఖర్చు
ముఖ్యమంత్రి, మంత్రులు రాజ్యాంగానికి అనుగుణంగా, రాజ్యాంగ విశ్వాసానికి కట్టుబడి పని చేయాలి. ప్రజలకు మంచి చేయడానికే పని చేయాలే తప్ప.. కొందరు వ్యక్తులు, విస్తృత రాజకీయ లబ్ధి కోసం కాదు. ఓ ప్రాంత ప్రజలను ఓ రకంగా చూస్తూ, మరో ప్రాంత ప్రజలకు ప్రాధాన్యతను ఇవ్వడం రాజ్యాంగ విశ్వాసం కిందకు రాదు. 

మంత్రులు, ఎమ్మెల్యేలు మంచి పనులు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలే తప్ప, రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. పూలింగ్‌ కింద తీసుకున్న భూముల్లో రాజధానిని నిర్మించకుంటే ప్రజలు.. ప్రజా ప్రతినిధులపై విశ్వాసాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. 
రాష్ట్రానికి ఆర్థిక పరమైన ఇబ్బందులున్నాయని అనుకున్నా, ప్రభుత్వం వివిధ పథకాల కింద పెద్ద సంఖ్యలో ప్రజలకు కోటాను కోట్ల రూపాయల మేర ఆర్థిక సాయం అందిస్తూనే ఉంది. సంక్షేమ పథకాల అమలు కోసం లక్షల కోట్లు అప్పుగా తెస్తోంది. వచ్చిన ఆదాయాన్నంతా పథకాల కోసం వెచ్చిస్తోంది. 

ప్రభుత్వం ఈ బాధ్యతలను గుర్తించినప్పుడు రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా తమపై ఉందన్న విషయాన్ని కూడా గుర్తెరగాలి. రాజధాని అభివృద్ధి విషయంలో అఫిడవిట్లు దాఖలు చేయడం తప్ప అన్ని విధాలుగా ప్రభుత్వం మౌనం పాటిస్తోంది. ఆర్థిక పరమైన కారణాలతో ఇప్పటికే మొదలు పెట్టిన ప్రాజెక్టులను ఆపడానికి వీల్లేదు.

పూలింగ్‌ భూములను ఇతర అవసరాలకు వాడరాదు 
మాస్టర్‌ ప్లాన్‌ను తనంతట తాను మార్చడానికి సీఆర్‌డీఏకు అధికారం లేదు. మాస్టర్‌ ప్లాన్‌ను సవరించి జోన్‌ 5ను సృష్టిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధం. ఈ ఉత్తర్వులు అధికార దుర్వినియోగమే. అందుకే వాటిని రద్దు చేస్తున్నాం. 
రాజధాని నిర్మాణం కోసమే భారీ స్థాయిలో భూములు తీసుకున్నప్పుడు రాజధానిని మార్చడానికి వీల్లేదు. ల్యాండ్‌ పూలింగ్‌ కింద తీసుకున్న భూములను ఇతర అవసరాల నిమిత్తం రుణం కోసం, ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం, తాకట్టు పెట్టడం పూలింగ్‌ నిబంధనలకు విరుద్ధం. ఇలా చేయడం రైతుల హక్కులను హరించడమే. 

రైతులకు ఆశ చూపి భూములిచ్చేలా చేశారు.. 
వాస్తవానికి పూలింగ్‌ కింద తీసుకున్న భూములన్నీ మంచి సారవంతమైన భూములు. ఏటా మూడు పంటలు పండేవి. ఆ భూములు ఇస్తే 1000 చదరపు గజాల నివాస ప్లాట్, 400 గజాల వాణిజ్య ప్లాట్‌ ఇస్తామంటూæ రాష్ట్రం, అధికారులు రైతులకు ఆశ చూపి స్వచ్ఛందంగా భూములు అప్పగించేలా చేశారు. 

ప్రస్తుతం అభివృద్ధి పనులన్నింటినీ నిలిపేయడం వల్ల, ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం అమలులో విఫలం చెందడం వల్ల, ప్రభుత్వం తన హామీలను ఉల్లంఘించడం వల్ల 30 వేల కుటుంబాలు నాశనం అయ్యాయి.

ఐదేళ్ల తర్వాత కూడా రాజధాని నగర నిర్మాణ కల పీడకలగానే మిగిలిపోయింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాల ద్వారా భూములిచ్చిన రైతుల ఆశలు మట్టిలో కలిసిపోయాయి. నిధులు లేవన్న పేరుతో అభివృద్ధి మొత్తం ఆపేశారు.

2021లో పురపాలక శాఖ జారీ చేసిన జీవో 23 కేవలం ఓ కంటి తుడుపు చర్య మాత్రమే. ఈ జీవో జారీ తర్వాత కూడా అభివృద్ధిలో ఎలాంటి పురోగతి లేదు. భూములు ఇవ్వడం ద్వారా జీవనోపాధి కోల్పోయిన రైతులను మిగిలిన సాధారణ పౌరులతో సమానంగా చూస్తే వారి హక్కులను హరించడమే. ఆస్తి హక్కు రాజ్యాంగ, చట్టబద్ధ హక్కు మాత్రమే కాదు, అది మానవ హక్కు కూడా. అలాంటి హక్కును హరించడమంటే మానవ హక్కును హరించినట్లే.

హామీని నెరవేర్చాల్సిందే 
ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం చట్ట విరుద్ధం కాదు.  సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలను ఉపసంహరించుకుంటూ తాజాగా తెచ్చిన చట్టాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ స్కీంకు రక్షణ ఉంది. అందువల్ల ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిందే.
గత ప్రభుత్వం లాభ నష్టాలను, నిధులను పరిగణనలోకి తీసుకునే రైతులకు పలు విధాలా లబ్ధి చేకూర్చింది. ఈ కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించే విధంగా ప్రభుత్వం, సీఆర్‌డీఏ వ్యవహరించాయి. కాబట్టి అధికరణ 226 కింద మాకున్న అధికారాలను ఉపయోగించి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నాం.

హైకోర్టును మార్చే అధికారం రాష్ట్రానికి లేదు
పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని రద్దు చేస్తూ తాజాగా తీసుకొచ్చిన చట్టంలో కూడా ప్రభుత్వం బహుళ రాజధానుల ప్రస్తావన తెచ్చింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 94(3), (4) ప్రకారం రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయాన్ని కేంద్రం అందించాలి. కొత్త రాజధాని నిర్మాణం కోసం అవసరమైన అన్ని చర్యలు కేంద్రం తీసుకోవాలి. 

రాజధాని విషయంలో పార్లమెంట్‌ పునర్విభజన చట్టంలో స్పష్టంగా చెప్పింది. అందువల్ల ఈ కోర్టు జనరల్‌ క్లాజు చట్టం జోలికి వెళ్లడం లేదు. సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకుంటే, రాష్ట్రాల ఏర్పాటు విషయంలో పార్లమెంట్‌కు మాత్రమే ఆ అధికారం ఉంది. రాష్ట్రాలను రద్దు చేసే అధికారం కూడా పార్లమెంట్‌కు మాత్రమే ఉందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. 
శాసన, న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థలను ఏర్పాటు చేసే విస్తృతాధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉంది. పాలనా వికేంద్రీకరణ చట్టం ద్వారా న్యాయ రాజధానిని మార్చాలన్న ప్రతిపాదనను ఈ కోర్టు గమనించింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రిన్సిపల్‌ సీటును అమరావతిగా రాష్ట్రపతి నోటిఫై చేశారు.

పాలనా వికేంద్రీకరణ చట్టం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం హైకోర్టును కర్నూలుకు మార్చాలని భావించింది. అయితే రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 6 ప్రకారం (కేంద్ర జాబితా) హైకోర్టు ఏర్పాటు, నిర్వహణ పూర్తిగా పార్లమెంట్‌ పరిధిలోనిది. హైకోర్టులో అధికారులు, సిబ్బంది నియామకం విషయంలో మాత్రం అధికారం రాష్ట్రానిదే.

హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చడం రాజ్యాంగ, ఏపీ పునర్విభజన చట్ట నిబంధనలకు విరుద్ధమే అవుతుంది. ఇలాంటి వాటిని అంగీకరిస్తే, ప్రభుత్వం మారినప్పుడల్లా హైకోర్టును మార్చే ప్రమాదం ఉంది. ఇందులో దూరాభారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. శ్రీకాకుళం నుంచి కర్నూలు వెళ్లడం అంటే 1000 కిలోమీటర్లు ప్రయాణించాలంటే ప్రజలకు కష్టతరమే.

హైకోర్టు ప్రిన్సిపల్‌ సీటును రాష్ట్రపతి మాత్రమే నిర్ణయిస్తారు. హైకోర్టు బెంచ్‌లను గవర్నర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఏర్పాటు చేస్తారు. అందువల్ల హైకోర్టును మార్చే అధికారం రాష్ట్రానికి లేదు.

ఆర్థిక కారణాలతో ప్రాజెక్టులు ఆపడానికి వీల్లేదు
మంత్రులు, జడ్జీలు, ఎమ్మెల్యే తదితరుల క్వార్టర్లన్నీ కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న హాస్యాస్పద నిర్ణయం వల్ల అన్ని అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులు వదిలేసి వెళ్లిపోయారు. 
రాష్ట్రానికి గానీ, సీఆర్‌డీఏకు గానీ ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తాల గురించి ఎలాంటి పట్టింపు లేదు. సారవంతమైన భూములు పిచ్చి మొక్కలతో చిన్నపాటి అటవీ ప్రాంతంగా మారాయి. ప్రభుత్వం, సీఆర్‌డీఏ తీరు వల్ల వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయింది. ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాదన్న కుంటి సాకుతో ప్రాజెక్టును ఆపేయడం సరికాదు. 

ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి ఎలాంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులన్నీ ఆగిపోయాయి. రూ.15 వేల కోట్ల ప్రజాధనం ఈ ప్రాజెక్టులపై వెచ్చించినప్పుడు వాటిని ప్రజల కోసం పూర్తి చేయాల్సి న బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేని పక్షంలో ఆ డబ్బు మొత్తం వృథానే అవుతుంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top