ఫ్లెక్సీ మీద పడి ఇద్దరికి తీవ్రగాయాలు
అనంతపురం క్రైం: నగర పాలక సంస్థ పరిధిలో టీడీపీ నేతలు అనధికారికంగా ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ మీదపడి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. నగర శివారులోని బళ్లారి బైపాస్ చౌరస్తా.. 44వ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ప్రధాన అనుచరులు రమేష్, నలుబోలు మధుతో పాటు పలువురు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో ఒకటి గాలికి ఎగిరి అటుగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లికి చెందిన సంజీవరెడ్డి, శ్రీనివాసరెడ్డిపై కుప్పకూలింది. ఐరన్ ఫ్రేమ్ నుదిట్లోకి దూసుకెళ్లడంతో సంజీవరెడ్డి తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడు. శ్రీనివాసరెడ్డి తలకు బలమైన గాయమై అరగంటకు పైగా అపస్మారకంగా రోడ్డుపై పడిపోయాడు. అటుగా వెళుతున్న వాహనదారులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సర్వజనాస్పత్రికి తరలించింది. పరిశీలించిన వైద్యులు సంజీవరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు నిర్ధారించారు. కాగా, గాలికి ఊగుతున్న భారీ ఫ్లెక్సీని తొలగించాలని పలుమార్లు టీడీపీ నేతలకు తెలిపినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్థానికులు తెలిపారు. చివరకు నగర పాలక సంస్థ అధికారులకు తెలిపినా వారు కూడా పట్టించుకోలేదన్నారు. చివరకు పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు ప్రాణాలు బలయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని నగర ప్రజలు కోరుతున్నారు.
పీఏబీఆర్ నుంచి నీటి విడుదల
కూడేరు: పీఏబీఆర్ నుంచి దిగువన ఉన్న మిడ్‌పెన్నార్ డ్యాంకు నీటిని విడుదల చేశారు. సోమవారం ఉదయం రిజర్వాయర్ 2, 4, 7 గేట్లను పైకెత్తి 620 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ మేరకు ఇరిగేషన్ డీఈఈ వెంకరమణ, ఏఈఈలు లక్ష్మీదేవి, గంగమ్మ, రేణుక, ముత్యాలప్ప వెల్లడించారు. ధర్మవరం కుడి కాలువకు 770 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తుండగా ఆదివారం వేకువజామున జల్లిపల్లి 4వ కి.మీ. వద్ద కాలువ గట్టు తెగి నీరంతా పంట పొలాల్లోకి చేరింది. కుడి కాలువ గేట్లు కిందకు దించితే మళ్లీ పైకి లేవడానికి మొరాయిస్తాయని భయపడిన అధికారులు డ్యాం ఎస్కేప్ రెగ్యులేటర్ వద్ద నీటిని కుడి కాలువ నుంచి మిడ్ పెన్నార్ డ్యామ్‌కు మళ్లించారు. మూడు గేట్ల ద్వారా 620 క్యూసెక్కులు కలుపుకుని మొత్తంగా 1,390 క్యూసెక్కుల నీటిని మిడ్ పెన్నార్‌కు విడుదల చేసినట్లైంది. డ్యాంలో 5.21 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 730 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,600 క్యూసెక్కులున్నటు డీఈఈ తెలిపారు.
రక్తమోడుతున్న శ్రీనివాసరెడ్డి, అపస్మారకంగా పడి ఉన్న సంజీవరెడ్డి
ఫ్లెక్సీ మీద పడి ఇద్దరికి తీవ్రగాయాలు


