ప్రాణం తీసిన పొగ మంచు
కనగానపల్లి: బెంగళూరు నుంచి హైదరాబాదుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువతి మార్గమధ్యంలో పొగ మంచు కారణంగా ప్రమాదానికి గురై దుర్మరణం పాలైంది. ఈ ఘటన శనివారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌కు చెందిన రాళ్లపల్లి వినీల (35) బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. మార్గమధ్యంలోని మామిళ్లపల్లి వద్దకు రాగానే పొగ మంచులో జాతీయ రహదారి పక్కన ఉన్న ఐరన్ సేఫ్టీబార్ కనిపించక ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఆమె రోడ్డుపై పడింది. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కనగానపల్లి పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని మృతురాలి వివరాలు సేకరించారు.
పీహెచ్‌డీ పూర్తి చేసిన యువతి సికింద్రాబాద్‌కు చెందిన రాళ్లపల్లి ధర్మరావు, కుష్మా దంపతుల కుమార్తె వినీల. ఇటీవలే ఈమె సైకాలజీ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. బెంగళూరులో ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె శనివారం తెల్లవారుజామున బెంగళూరులోని బంధువుల ఇంట్లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని తీసుకుని హైదరాబాద్‌కు బయల్దేరింది. పొగమంచు ఎక్కువగా ఉండడంతో సేఫ్టీబార్ కనిపించక రోడ్డు ప్రమాదానికి గురైంది. విషయాన్ని సికింద్రాబాద్‌లోని కుటుంబ సభ్యులకు తెలియజేసి, వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ నూర్ మహ్మద్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ యువతి దుర్మరణం
బెంగళూరు నుంచి హైదరాబాదుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఘటన


