రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం కురుగుంట శివారులో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆలమూరుకు చెందిన జెన్నే సాయి సిద్ధార్థ (19) మృతిచెందాడు. వివరాలు.. ఆలమూరుకు చెందిన జెన్నే రామకృష్ణ కుమారుడు సాయి సిద్ధార్థ ఆత్మకూరు మండలం కొత్తపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా చిన్నంపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం సాయిసిద్ధార్థ బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు.
రేపు అంధ మహిళల టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ రాక
మడకశిర: మడకశిరకు అంధుల మహిళల టీ 20 ఇండియా క్రికెట్ కెప్టెన్ దీపిక సోమవారం రానున్నారు. తొలి సారిగా ప్రపంచ కప్ గెలిచి, ఆమె తన సొంత గడ్డ మడకశిరకు వస్తున్నారు. అమరాపురం మండలం తంబాలహట్టి గ్రామానికి చెందిన దీపిక మడకశిరకు వస్తుండడంతో ఆమెకు ఘనంగా స్వాగతం పలకడానికి ప్రజలు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో స్థానిక నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు ఏర్పాట్లపై చర్చించారు.
సెలవులో ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి
అనంతపురం సెంట్రల్: మహిళా,శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ అరుణకుమారి వారం రోజులు పాటు సెలవులో వెళ్లనున్నారు. ఈమె గుడ్ గవర్నెస్ అంశంపై వెస్ట్ బెంగాల్, నోయిడాలో జరుగుతున్న సెమినార్‌లో పాల్గొననున్నారు. శింగనమల సీడీపీఓ లలితకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించనున్నారు. శిశుగృహ పర్యవేక్షణ అధికారిగా అనంతపురం అర్బన్ సీడీపీఓ అనురాధకు అప్పగించినట్లు తెలిసింది.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


