అన్నదాతను ఆదుకునే మనసు లేదు
● స్వప్రయోజనాల కోసమే బాబు పాకులాట
● అచ్చెన్న వ్యాఖ్యలపై ‘అనంత’ ధ్వజం
అనంతపురం: అన్నదాతను ఆదుకునే మనసు చంద్రబాబు ప్రభుత్వానికి లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. పాత కేసుల మాఫీ కోసం 15రోజులకోసారి ప్రధాని మోదీని కలవడం మోకరిల్లడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని విమర్శించారు. పుట్లూరు మండలం ఎల్లుట్లలో అరటి రైతు నాగలింగమయ్య ఆత్మహత్య ఘటనను వైఎస్సార్‌సీపీ శవరాజకీయాల కోసం వాడుకుంటోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను అనంత ఖండించారు. బాధిత కుటుంబానికి ఆత్మస్థైర్యం కలిగించడంతో పాటు పాటు రైతాంగానికి తోడుగా ఉంటామని చెప్పడం కోసమే తాము ఎల్లుట్లకు వెళ్లామని చెప్పారు. రైతులను ఆదుకోవాలని కోరితే శవ రాజకీయాలు చేస్తున్నామని వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థ విధానాల వల్లే రైతులు శవాలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టానికి విరుద్ధంగా రైతు నాగలింగమయ్య మృతదేహానికి తెల్లవారుజామునే పోస్టుమార్టం చేసి.. గ్రామానికి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కనీసం బంధుమిత్రులందరూ వచ్చే అవకాశం కూడా లేకుండా పోలీస్ బందోబస్తు మధ్య అంత్యక్రియలు పూర్తి చేయిస్తారా అని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీం పవన్‌కళ్యాణ్, నారా లోకేష్‌లు ఢిల్లీ వెళ్లి గిట్టుబాటు ధరల కోసం ప్రధాని మోదీని డిమాండ్ చేయాలని సూచించారు. రైతులెవరూ నిరాశ చెందవద్దని, చావు పరిష్కారం కాదని, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని కుటుంబాలను కష్టాల్లోకి నెట్టవద్దని అన్నారు.
అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకెళ్దాం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో అంబేడ్కర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ స్వయం శక్తి, కృషితో మహోన్నతమైన స్థానానికి చేరిన అంబేడ్కర్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంబేడ్కర్ దార్శనికతను మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో చూపించిన అంశాన్ని గుర్తు చేశారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ అవకాశాలు కల్పించారని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీచైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, అనంత చంద్రారెడ్డి, మీసాల రంగన్న, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్, మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి సాహిత్య, నాయకులు అశ్వర్థ నాయక్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్నోబులేసు, వీరాంజినేయులు, వెన్నం శివరామిరెడ్డి, నాగన్న, రంగంపేట గోపాల్‌రెడ్డి, ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


