హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం
అనంతపురం టవర్‌క్లాక్: హైకోర్టు న్యాయ మూర్తి, అనంతపురం జిల్లా అడ్మిని స్ట్రేటివ్ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎస్.భానుమతి శనివారం జిల్లా పర్యటనకు విచ్చేశారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద న్యాయమూర్తిని కలెక్టర్ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి భీమరావు, ఎస్పీ జగదీష్ పాల్గొన్నారు.
నేడు ఎన్‌ఎంఎంఎస్
మెరిట్ పరీక్ష
● 4 ప్రాంతాల్లో 15 పరీక్ష కేంద్రాలు
అనంతపురం సిటీ: కేంద్ర ప్రభుత్వం అందించే ఉపకార వేతనాల కోసం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షలు ఆదివారం నిర్వహించనున్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అర్హులు. జిల్లా వ్యాప్తంగా 3,340 మంది దరఖాస్తు చేసుకున్నట్లు డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. వీరి కోసం అనంతపురంలో 5, కళ్యాణదుర్గంలో 3, రాయదుర్గంలో 3, గుంతకల్లులో 4 కేంద్రాల చొప్పున మొత్తం 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు వెబ్‌సైట్, వాట్సాప్‌లలో హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈ అంశానికి సంబంధించి సందేహాలు ఉంటే ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలన్నారు. హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ఉంటుందని, దీని ఆధారంగా విద్యార్థులు ఇంటి నుంచి నేరుగా పరీక్ష కేంద్రానికి సులభంగా చేరుకోవచ్చని తెలిపారు. పరీక్ష ఫలితాలు వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో వస్తాయన్నారు. పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తయ్యే వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున బ్యాంకు ఖాతాకు స్కాలర్‌షిప్ జమ అవుతుందని వెల్లడించారు.
అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్‌కు ‘అనంత’ క్రీడాకారుడు
అనంతపురం సిటీ: అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్‌కు అనంతపురానికి చెందిన క్రీడాకారుడు నరేష్ ఎంపికయ్యాడు. ఇతను ఎస్‌ఎస్‌బీఎన్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం సీఈసీ చదువుతున్నాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఇటీవల నిర్వహించిన అథ్లెటిక్స్‌లో పాల్గొని 100 మీ. 400 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచాడు. దుబాయ్‌లో ఆదివారం నుంచి 14వ తేదీ వరకు జరగనున్న అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ పోటీల్లో భారత్ తరఫున ఆడేందుకు బయలుదేరి వెళ్లినట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డా.శ్రీనివాస్‌రెడ్డి శనివారం తెలిపారు. నరేష్‌ను కళాశాల కరస్పాండెంట్ పీఎల్‌ఎన్ రెడ్డి, ప్రెసిడెంట్ పీవీ రమణారెడ్డి, సెక్రటరీ నిర్మలమ్మ, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.ఎస్.రామ్మోహన్ అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలోనూ మన దేశ కీర్తిని చాటాలని ఆకాంక్షించారు.


