ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో!
అనంతపురం సెంట్రల్: ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసుకున్న తన షెడ్డును దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారని న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వెళ్లిన బాధిత మహిళను అధికారపార్టీ నేతలతో పాటు సీఐ దుర్భాషలాడటంతో పాటు బెదిరించారు. మనస్తాపం చెందిన బాధితురాలు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన శనివారం అనంతపురంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. అనంతపురంలో గుత్తిరోడ్డు నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే ప్రధాన దారి పక్కన డీసీఎంఎస్ స్థలంలో గానుగ మెహతాజ్ అనే మహిళ గత కొన్నేళ్లుగా రేకులషెడ్‌లో హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇటీవల సదరు స్థలంపై టీడీపీ నేతల కన్ను పడింది. స్థలాన్ని ఖాళీ చేయాలని అనేకసార్లు ఆమైపె ఒత్తిడి తెచ్చారు. అవసరమైతే తాను లీజుకు తీసుకుంటానని చెప్పినా వినలేదు. ఇటీవల కళ్యాణదుర్గం వచ్చిన నారా లోకేష్‌కు ఆమె తన సమస్యను మొరపెట్టుకుంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ నెట్టం వెంకటేష్‌ను కలిసి వేడుకుంది. దీంతో సదరు టీడీపీ నేతలు ఆగ్రహించారు. ‘నారా లోకేష్‌నే కలుస్తావా.. నీకు స్థలం ఇచ్చేది లేదు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో’ అంటూ బెదిరించినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల జాఫర్, రఘు అనే వ్యక్తులు వచ్చి దౌర్జన్యం చేశారని, తర్వాత అర్ధరాత్రి సమయంలో తమ షెడ్డును అక్కడినుంచి ఎత్తుకుపోయారని వాపోయారు. పైగా ఆ స్థలాన్ని తమకు ఇచ్చారంటూ నిర్మాణం చేపడుతున్నారన్నారు. దీనిపై త్రీటౌన్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్‌ను కలిసి మొరపెట్టుకుందన్నారు. అయితే ‘నీ కేసు తీసుకునేది లేదు’ అంటూ సీఐ తీవ్రస్థాయిలో బెదిరించినట్లు ఆరోపించారు. ఇక తనకు న్యాయం జరగదని మనస్తాపం చెందిన మెహతాజ్ శనివారం అదే స్థలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అధికారపార్టీ నేతలతో పాటు సీఐ బెదిరింపు
షెడ్డు దౌర్జన్యంగా తొలగించినా ఫిర్యాదు స్వీకరణకు ససేమిరా
మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు


