స్ఫూర్తి ప్రదాత అంబేడ్కర్
అనంతపురం సిటీ/ అనంతపురం టవర్‌క్లాక్: సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కులు, విద్యా విస్తరణ కోసం పోరాడిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యావత్ జాతికి స్ఫూర్తి ప్రదాత అని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ ఆనంద్ అన్నారు. ఆయన అలోచనలను ఆచరణలో పెట్టినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పరిషత్ ఎదుట అంబేడ్కర్ 69వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సర్కిల్‌లో గల అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్‌తో పాటు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, దళిత, ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్స్‌న్ బోయ గిరిజమ్మ, నగర పాలక సంస్థ మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి, ఏడీసీసీబీ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, బండారు శ్రావణిశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపశిల్పి అంబేడ్కర్.. ‘జ్ఞానం పొందు– కష్టపడు –సంఘటితం అవ్వు’ అనే సూత్రాలు నమ్మి ఆచరించి సమాజానికే మార్గదర్శకులయ్యారని కొనియాడారు. జిల్లాలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీల్లో బాల్య వివాహాలు కొనసాగిస్తుండడంపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కుష్బూ కొఠారి, అధికారులు రామూనాయక్, శ్రీనివాసులు, రామ్మోహన్, వైఎస్సార్‌సీపీ నాయకులు అనంత చంద్రారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, మీసాల రంగన్న, పసలూరు ఓబిలేసు, సాకే అశోక్ కుమార్, లబ్బే రాఘవ, శ్రీనివాసులు నాయక్, కార్పొరేటర్ సాకే చంద్రలేఖ, సాకే కుళ్లాయి స్వామి, సాకే శివశంకర్, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పాల్గొన్నారు.


