కసాపురంలో నేటి నుంచి హనుమద్ వ్రతం
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం నుంచి రెండు రోజుల పాటు హనుమద్ వ్రతం ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం గుంతకల్లులోని హనుమాన్ సర్కిల్‌లో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం వద్ద మాలధారుల ఇరుముడి కార్యక్రమం ఉంటుంది. అనంతరం అశ్వ వాహనంపై కొలువుదీరిన నెట్టికంటి ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 9 గంటలకు వేలాది మంది మాలధారులు శోభాయాత్రతో కసాపురానికి చేరుకుంటారు. ఆలయంలో మాలధారులు సమర్పించిన ఇరుముడిలోని ద్రవ్యాలతో సాయంత్రం 7 గంటలకు హోమం నిర్వహిస్తారు. బుధవారం ఉదయం ఇరుముడి ద్రవ్యాలతో మూలవిరాట్‌కు అభిషేకాలు ఉంటాయి. అనంతరం హనుమద్ వ్రతాన్ని ప్రారంభిస్తారు.
కటకటాలపాలైన నకిలీ డీఎస్పీ
● ప్రధాన నిందితుడు నల్లమాడ మండలం వేలమద్ది నివాసి శ్రీనివాస్
వరంగల్ క్రైం: ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఏసీబీ నకిలీ డీఎస్పీ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. నిందితుడితోపాటు అతడికి సహకరించిన నలుగురు ముఠా సభ్యులను వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను సోమవారం మీడియాకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం వేలమద్ది గ్రామానికి చెందిన రాచంపల్లి శ్రీనివాస్ ప్రధాన నిందితుడు, కర్ణాటకలోని రాంనగర్ జిల్లా హరోహళ్లీ గ్రామానికి చెందిన నవీన్ జేఆర్, బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌కు చెందిన మంగల రవీందర్, మురళి, ప్రసన్న పట్టుబడగా సూర్యప్రకాష్, తాటిమర్రి వేణు, కొత్తకోట రమణ పరారీలో ఉన్నారు. వీరి నుంచి 13 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రధాన నిందితుడు 2002లో మొదట ద్విచక్ర వాహనం చోరీ చేశాడు. నకిలీ పోలీస్ అధికారిగా అవతారమెత్తి రాయలసీమలో జరిగిన పలు దొంగతనాల్లో అరెస్టు అయిన నిందితుల కుటుంబ సభ్యులను టార్గెట్ చేశాడు. దొంగసొత్తు దాచి ఉంచారని వారిని బెదిరించి బంగారం, డబ్బు దోపిడీకి పాల్పడ్డాడు. సుమారు 50 కేసుల్లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు ఆయన తెలిపారు. జైలు నుంచి విడుదలైన అనంతరం నిందితుడు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, రాయలసీమ ప్రాంతాల్లో 41కి పైగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. పోలీసులు మరోమారు అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు ఆయన తెలిపారు. నిందితుడు జైలు నుంచి విడుదలైన అనంతరం నకిలీ ఏసీబీ డీఎస్పీగా అవతారం ఎత్తి ప్రభుత్వ ఉద్యోగులను ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. పలు ఘటనల్లో 19 కేసులు నమోదు కాగా రూ.50 లక్షలు దోపిడీకి పాల్పడినట్లు సీపీ పేర్కొన్నారు.
కసాపురంలో నేటి నుంచి హనుమద్ వ్రతం


