తమ్ముళ్ల ఇసుక దోపిడీ
శింగనమల: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల ధన దాహానికి వాగులు, వంకలు కనుమరుగవుతున్నాయి. అడ్డగోలుగా ఇసుక అక్రమ తరలింపు చేపట్టి ప్రశ్నించిన వారిని ‘ప్రభుత్వం మాది... మేం ఏమీ చేసినా చెల్లుతుంది. కాదని ఎవరైనా అంటే భూమి మీద నూకలు చెల్లిపోతాయి’ అని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో వారి ఆగడాలను అడ్డుకునే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు.
ప్రజాప్రతినిధి అండతో..
శింగనమల నియోజకవర్గంలో శింగనమల, గార్లదిన్నె, యల్లనూరు, బుక్కరాయసముద్రం మండలాల్లోని వంకలు, వాగులు, పెన్నా, చిత్రావతి నదుల్లో పుష్కలంగా ఇసుక లభ్యమవుతోంది. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధి అండతో ఆయా వంకలు, వాగులు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తరలింపులతో టీడీపీ నాయకులు రూ. లక్షల్లో కూడబెట్టుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. తాజాగా శింగనమల మండలంలోని చీలేపల్లి వంకపై కన్నేసిన టీడీపీ నాయకులు.. 20 రోజులుగా ఇసుకను యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రోజుల వ్యవధిలోనే వంక మొత్తం గోతుల మయమై పోయింది. సలకంచెర్వు నుంచి చీలేపల్లికి వెళ్లే మార్గంలో వంకలోకి టిప్పర్ల వెళ్లేందుకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. వంకలో జేసీబీని ఏర్పాటు చేసి ఇసుకను తవ్వి ఒడ్డున ఓ చోట డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా రాత్రి సమయాల్లో ఇతర ప్రాంతాలకు తరలించి, సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పర్‌కు రూ.5వేలు చొప్పున ఈ రోజుల్లోనే రూ. 50 లక్షలకు పైగా ఇసుకను దోచేశారు. ఈ విషయం రెవెన్యూ అధికారులు, పోలీసులకు తెలిసినా వారు అటుగా కన్నెత్తి కూడా చూడడం లేదు.
రోజూ టిప్పర్ల ద్వారా అక్రమ రవాణా
రైతులు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు
ఉనికి కోల్పోతున్న చీలేపల్లి వంక
టిప్పర్ డ్రైవర్లకు ప్రత్యేక వసతి
వంకలో ఇసుకను తరలించుకెళ్లేందుకు వచ్చే టిప్పర్ డ్రైవర్ల కోసం టీడీపీ నేతలు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. డ్రైవర్లు నిద్రించేందుకు వంక పక్కనే ప్రత్యేకంగా మంచాలు వేశారు. భోజనాలు, ఇతరత్రాలను అక్కడే సమకూరుస్తున్నారు. దీంతో చీలేపల్లి వంక నుంచి ఇసుక తరలించేందుకు టిప్పర్ డ్రైవర్లు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇసుక తరలింపులతో భూగర్భ జలాలు అడుగంటి పంటల సాగు ప్రశ్నార్థకమవుతుందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇసుక అక్రమ తరలింపులు అడ్డుకోవాలని అధికారులకు విన్నవించినా వారు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక అక్రమ తరలింపులు అడ్డుకోవాలని వేడుకుంటున్నారు.
తమ్ముళ్ల ఇసుక దోపిడీ


