సీనియర్ జర్నలిస్ట్ కాలవ రమణ మృతి
అనంతపురం: సీనియర్ జర్నలిస్ట్ కాలవ రమణ (54) అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. ఆయనకు భార్య రాజేశ్వరి, కుమార్తె జాహ్నవి ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వివిధ పత్రికల్లో ఆయన పాత్రికేయుడిగా పనిచేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... అనంతపురంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోంలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. రాజకీయ, అధికార, అనధికారులతో సుదీర్ఘ పరిచయాలు ఉన్న కాలవ రమణ... జిల్లా కరువు, సాగునీటి పరిస్థితులపై ఎప్పటికప్పుడు కథనాలు రాస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మృతిపై అన్ని వర్గాల వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు జర్నలిస్టులు నర్సింగ్ హోం వద్దకెలిల రమణ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలకు మృతదేహాన్ని స్వస్థలం హిందూపురానికి కుటుంబసభ్యులు తరలించారు.
రమణ మృతి బాధాకరం : అనంత
వృత్తి పట్ల అంకితభావం, నిబద్ధత గల కాలవ రమణ మృతి బాధాకరమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందరితో కలివిడిగా, ఆప్యాయంగా ఉంటూ అభిమానంగా మాట్లాడే కాలవ రమణ పత్రికా లోకానికి తీరని లోటుగా అభివర్ణించారు. పాత్రికేయ వృత్తిలో విశేష సేవలు అందించిన సీనియర్ జర్నలిస్ట్ కాలవ రమణ మృతి బాధాకరమని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. హిందూపురంలోని కాలవ రమణ నివాసం వద్ద మృతదేహాన్ని ఆయన సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
‘కమర్షియల్’లో జేసీ, డీసీలుగా పదోన్నతులు
అనంతపురం ఎడ్యుకేషన్: కమర్షియల్ ట్యాక్స్ శాఖలో జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లుగా పదోన్నతులు కల్పించి స్థానాలు కేటాయించారు. ఈ మేరకు సోమవారం ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం డివిజన్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న పి.భాస్కర్‌వల్లికి జాయింట్ కమిషనర్‌గా పదోన్నతి కల్పించి విజయవాడ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి బదిలీ చేశారు. అలాగే తాడిపత్రి సర్కిల్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్న ఎస్.సోనియాతారకు డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి కల్పించి విజయవాడ–3 డివిజన్‌కు, సూర్యపేట సర్కిల్ విజయవాడ–2 డివిజన్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్న షేక్ షహనాజ్‌బేగంకు డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి కల్పించి అనంతపురం డివిజన్ కార్యాలయానికి బదిలీ చేశారు. కాగా డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి పొందిన సోనియాతారను ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం అనంతపురం చైర్మన్ జమీలాబేగం, ఇతర సభ్యులు శాలువా కప్పి అభినందించారు.
ఖైదీల బందోబస్తులో జాగ్రత్తలు తప్పనిసరి
అనంతపురం సెంట్రల్: ఖైదీల ఎస్కార్టు, గార్డు డ్యూటీల్లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్‌బాషా సూచించారు. పోలీసు కార్యాలయ ఆవరణలోని జిల్లా శిక్షణ కేంద్రంలో సిబ్బందికి ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఖైదీల వివరాలను ముందుగా తెలుసుకోవాలని, ఆయుధాలు, హ్యాండ్‌కప్స్, లీడింగ్ చైన్లను అవసరానికి తగినట్లుగా వాడాలని సూచించారు. ఆయుధాల అప్పగింత విధి ప్రకారం జరగాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, ఆర్‌ఐ పవన్‌కుమార్, ఆర్‌ఎస్‌ఐలు బాబ్జాన్, రమేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ కాలవ రమణ మృతి
సీనియర్ జర్నలిస్ట్ కాలవ రమణ మృతి


