ఎద్దుల బండిని ఢీకొన్న ప్రైవేట్ బస్సు
● రైతుకు తీవ్రగాయాలు
● జోడెద్దులు మృతి
విడపనకల్లు: మండలంలోని పెద్ద కొట్టాలపల్లి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో రైతుకు తీవ్రంగా గాయపడగా జోడెద్దులు మృతి చెందాయి. వివరాలు... పెద్ద కొట్టాలపల్లి గ్రామానికి చెందిన రైతు ఎర్రిస్వామిరెడ్డి సోమవారం తెల్లవారుజామున ఎద్దుల బండి కట్టుకుని మాళాపురం వైపుగా ఉన్న తన పొలానికి బయలుదేరాడు. పెద్ద కొట్టాలపల్లి సమీపంలోకి చేరుకోగానే 42వ జాతీయ రహదారిపై శరవేగంగా దూసుకొచ్చిన పీఎస్‌ఆర్ ట్రావెల్స్ బస్సు.. వెనుక నుంచి బండిని ఢీకొంది. ఘటనలో ఎద్దులతో పాటు బండి ఎగిరి రోడ్డుపక్కనే ఉన్న పొలంలో పడి ముక్కలైపోయింది. ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. తీవ్రంగా గాయపడిన ఎర్రిస్వామిరెడ్డిని స్థానికులు వెంటనే అంనతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై విడపనకల్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
డీసీఎం బాధ్యతల స్వీకరణ
గుంతకల్లుటౌన్: స్థానిక రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (డీసీఎం)గా జి.మోహన్‌కృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఇక్కడ డీసీఎంగా పనిచేస్తున్న శ్రీకాంత్‌రెడ్డి సికింద్రాబాద్ డివిజన్‌కు డీఓఎంగా బదిలీ అయ్యారు.
గంజాయి విక్రేతల అరెస్ట్
అనంతపురం సెంట్రల్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి నుంచి 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుల వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. పట్టుబడిన వారిలో నగరంలోని టీవీ టవర్ ప్రాంతంలో నివాసముంటున్న షికారి శీనా, ఎన్టీఆర్ కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ ఉన్నారు. అందిన పక్కా సమాచారంతో సోమవారం నదోదయ కాలనీ శశ్మాన వాటిక వద్ద నిందితులను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
శిశుగృహ సిబ్బంది తొలగింపు
అనంతపురం సెంట్రల్: మహిళాశిశు సంక్షేమశాఖ పరిధిలోని శిశుగృహ సిబ్బందిని తొలగిస్తూ ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ పీడీ అరుణకుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. శిశుగృహలో రెండు నెలల పసికందు నిరూప్ అక్టోబర్ 2న మృతిచెందిన విషయం తెలిసిందే. కేవలం శిశుగృహ సిబ్బంది నిర్లక్ష్యం, గొడవలు కారణంగా శిశువు మృతి చెందినట్లుగా అధికారిక విచారణలో నిర్ధారణ అయింది. దీంతో ఇటీవల సిబ్బంది మొత్తాన్ని తొలగిస్తూ కలెక్టర్ ఆనంద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏఎన్‌ఎం గుణవతి, ఆయాలు ఆదిలక్ష్మి, నూర్జహాన్, ప్రభావతమ్మ, వాచ్‌మెన్ రాజశేఖర్‌కు టర్మినేట్ చేస్తూ సోమవారం ఉత్తర్వులను అరుణకుమారి అందజేశారు. ఉత్తర్వులు అందుకునేందుకు శిశుగృహ మేనేజర్ దీప్తి, సోషల్ వర్కర్ లక్ష్మీదేవి రాలేదు.
ఎద్దుల బండిని ఢీకొన్న ప్రైవేట్ బస్సు
ఎద్దుల బండిని ఢీకొన్న ప్రైవేట్ బస్సు


