రూ.2.16 లక్షల విలువైన ఎరువుల సీజ్
కళ్యాణదుర్గం రూరల్: స్థానిక బళ్లారి మిట్టపై ఉన్న శ్రీచైతన్య ఎరువుల దుకాణంలో సోమవారం ఉదయం వ్యవసాయాధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమతుల్లేకుండా విక్రయానికి పెట్టిన రూ.2,16,054 విలువైన వివిధ రకాల ఎరువులను సీజ్ చేశారు. తనిఖీల్లో ఏడీఏ యల్లప్ప, మండల వ్యవసాయాధికారి శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.
పింఛన్ల పంపిణీ
95 శాతం పూర్తి
అనంతపురం టౌన్: సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ పక్రియ తొలిరోజు 95 శాతం మేర పూర్తయిందని డీఆర్‌డీఏ పీడీ శైలజ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తాడిపత్రిలో 97 శాతం, గుంతకల్లు అర్బన్‌లో 91 శాతంతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయన్నారు. పింఛన్ తీసుకోని లబ్దిదారులకు సచివాయాల్లో మంగళవారం అందజేయాలని ఉద్యోగులకు సూచించినట్లు తెలిపారు. అనివార్య కారణాల వల్ల పింఛన్ తీసుకోకపోతే వచ్చే నెలలో రెండు నెలల పింఛన్ మొత్తాన్ని అందజేస్తారని పేర్కొన్నారు.
విద్యుదాఘాతంతో
రైతు మృతి
శెట్టూరు/కుందుర్పి: విద్యుత్ షాక్‌కు గురై కుందుర్పి మండలం యర్రగుంట గ్రామానికి చెందిన రైతు కాపు రామాంజినేయులు(58) మృతిచెందాడు. వివరాలు... రైతు రామాంజనేయులుకు శెట్టూరు మండలం కనుకూరు ఫీడర్ పరిధిలో పొలం ఉంది. నాలుగు రోజుల క్రితం తన పొలంలోని విద్యుత్ లైన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ శాఖ అధికారుల అనుమతితో ఎల్‌సీ తీసుకుని స్తంభం పైకి ఎక్కి లైన్‌ను సరిచేస్తుండగా ఉన్నఫళంగా విద్యుత్ ప్రసరించి షాక్ గురై కిందపడ్డాడు. చుట్టుపక్కల రైతులు గమనించి వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రామాంజనేయులు పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు శెట్టూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


