కానిస్టేబుల్ భార్య ఆత్మహత్యాయత్నం
రాప్తాడు రూరల్: అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వీరనారాయణ భార్య యమున ఆత్మహత్యాయత్నం చేసింది. అదనపు కట్నం వేధింపులు తారాస్థాయికి చేరడంతో జీవితంపై విరక్తితో ఆమె పురుగుల మందు తాగింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... రాప్తాడుకు చెందిన యమునకు 11 ఏళ్ల క్రితం అనంతపురం రూరల్ పరిధిలోని చిన్నకుంటకు చెందిన వీరనారాయణతో పైళ్లెంది. పెళ్లి సమయంలో వీరనారాయణకు కట్న కానుకలు కింద రూ.3 లక్షల నగదు, 16 తులాల బంగారాన్ని యమున తల్లిదండ్రులు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. పుట్టినింటి నుంచి ఎకరా భూమి రాయించుకుని రావాలంటూ భార్యపై వీరనారాయణ ఒత్తిడి చేస్తూ వచ్చాడు. అప్పట్లో వేధింపులు భరించలేక యమున ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో పోలీసులు గుర్తించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ సమయంలోనే వీరనారాయణకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం భర్తతో కలసి యమున తోటకు వెళ్లింది. అక్కడ అదనపు కట్నం విషయంగా మరోసారి భర్త, అత్త, మామ, ఆడపడచు నిలదీశారు. యమున సమాధానం ఇచ్చే లోపు భౌతిక దాడికి పాల్పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన యమున నేరుగా ఇంటికి చేరుకుని తోట నుంచి తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారి సమాచారంతో వీరనారాయణ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న యమునను వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తరలించారు. కాగా, సమాచారం అందుకున్న ఇటుకలపల్లి పోలీసులు ఆస్పత్రికి చేరుకుని యమునను పరిశీలించారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడపడుచు వేధిస్తుండడంతోనే తమ కుమార్తె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందంటూ బాధితురాలి తల్లి, సోదరుడు వాపోయారు. ఘటనపై పోలీసులు విచారణ కొనసాగుతోంది.
అదనపు కట్నం వేధింపులు తాళలేక
పరిస్థితి విషమం... బెంగళూరుకు తరలింపు


