‘అధికార’ వేధింపులు
అనంతపురం: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం అనంత పురం నగరంలో నిర్వహించిన ‘ప్రజా ఉద్యమం’ నిరసన ర్యాలీ విజయవంతం కావడంతో జీర్ణించు కోలేని అధికార పార్టీ నేతలు విపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని రాజీవ్ కాలనీలో వైఎస్సార్‌సీపీకి మంచి పట్టు ఉండ డంతో అక్కడున్న విద్యార్థులు, యువ నాయకులను భయభ్రాంతులకు గురిచేసేలా అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధి ఎత్తుగడ వేశారు. అక్రమ కేసులు బనాయించేలా పోలీసులను ఆదేశించారు. ఆయన చెప్పిందే తడవుగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగానికి చెందిన ఆసిఫ్, మైనుద్దీన్, పవన్, దాదు వలి లను అనంతపురం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఎలాంటి నేరచరిత లేని వారిని బైండోవర్ పేరుతో పిలిచి, భయభ్రాంతులకు గురిచేశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆదేశాలతో పార్టీ లీగల్ సెల్, యువజన విభాగం నాయకులు త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ రాజేంద్రనాథ్‌తో మాట్లాడారు. పాత కేసులున్న వారిని స్టేషన్‌కు పిలిపించినట్లు సీఐ చెప్పగా.. ఒక్క కేసు కూడా లేని వాళ్లను కూడా తీసుకొచ్చారని యువజన విభాగం నేత సాకే చంద్రశేఖర్ బదులిచ్చారు. పైగా అసభ్యకరంగా మాట్లాడుతూ చేయి చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అదే పనిగా తమ పార్టీ నాయకులను వేధిస్తే స్టేషన్ ముందే బైఠాయిస్తామని, పోలీసుల వ్యవహారశైలి ఇలాగే ఉంటే ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని, అప్పటికీ న్యాయం జరగకుంటే డీజీపీ దృష్టికి తీసుకెళ్తామని మీడియా ముఖంగా హెచ్చరించారు. అధికార పార్టీ నాయకుల మాట విని పోలీసులు ఇదే పద్ధతి కొనసాగిస్తే న్యాయబద్ధంగా పోరాడతామని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉమాపతి అన్నారు. ఎవరిపై అయినా దాడి చేస్తే ప్రైవేట్ కేసులు పెట్టి కోర్టు ద్వారా శిక్షిస్తామని హెచ్చరించారు. తాము శాంతి యుతంగా ర్యాలీ చేసినప్పటికీ ఇబ్బంది పెట్టాలని పోలీసులు చూస్తున్నారని యువజన విభాగం నగర అధ్యక్షుడు శ్రీనివాస్ దత్త వాపోయారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, న్యాయవాది బాషా, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదా ఖలందర్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, సాంస్కృతిక విభాగం నగర అధ్యక్షుడు కసిరెడ్డి కేశవరెడ్డి, మైనార్టీ విభాగం నాయకుడు ఆసిఫ్, యువజన విభాగం నగర ఉపాధ్యక్షుడు వినీత్, నగర కార్యదర్శి మైను, యువజన విభాగం నాయకులు దాదు, హర్ష, సుబ్బారావు, రోహిత్, ఆకాష్, ఘన, ప్రసాద్, అనిల్ కుమార్ గౌడ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ప్రజా ఉద్యమం
విజయవంతం కావడంతో అక్కసు
ముఖ్య ప్రజాప్రతినిధి ఆదేశాలతో
యువజన విభాగం
నాయకులపై పోలీసుల ప్రతాపం


