కరువు కానరాలేదా కేశవా?!
ఖరీఫ్ నాలుగు నెలల కాలంలో తేలికపాటి వర్షాల నడుమ అతికష్టమ్మీద పంటల సాగుతో సాధారణ సాగు విస్తీర్ణం నమోదైంది. చివరికి 40 శాతం పంట దిగుబడులు కూడా చేతికి అందలేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వానికి ఇదంతా కానరాలేదు. ఇష్టారాజ్యంగా కరువు మండలాల జాబితా రూపొందించి జిల్లాకు మొండిచేయి చూపించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న పయ్యావుల కేశవ్ సొంత జిల్లాకు అన్యాయం జరుగుతున్నా నోరు మెదపకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. పైపెచ్చు సొంత నియోజకవర్గం ఉరవకొండ వ్యాప్తంగా రబీ రైతులకు సకాలంలో విత్తన పప్పుశనగ కూడా అందించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనంతపురం అగ్రికల్చర్: అవసరం లేని వాటికి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న చంద్రబాబు సర్కారు రైతుల విషయానికి వచ్చే సరికి ఉత్త చేతులు చూపుతుండడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కరువు మండలాల జాబితాకు సంబంధించి జిల్లాలో డ్రైస్పెల్స్ నమోదైన 23 మండలాలకైనా అవకాశం ఇవ్వకుండా అన్యాయం చేయడంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
23 మండలాల్లో 31 డ్రైస్పెల్స్..
పంటకాలంలో వరుసగా 21 రోజుల పాటు వర్షపాతం నమోదు కాకుంటే డ్రైస్పెల్‌గా పరిగణిస్తారు. డ్రైస్పెల్ అనగానే కరువు మేఘం కమ్ముకున్నట్లు లెక్క. జిల్లాలో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య నాలుగు నెలల ఖరీఫ్ కాలంలో 23 మండలాల్లో 31 డ్రైస్పెల్స్ నమోదయ్యాయి. 15 మండలాల్లో ఒకటి చొప్పున, మరో 8 మండలాల్లో రెండు డ్రైస్పెల్స్ చొప్పున నమోదు కావడం గమనార్హం. అందులో రాయదుర్గం, కణేకల్లు, విడపనకల్లు, గుత్తి, పెద్దవడుగూరు, పామిడి, వజ్రకరూరు, ఉరవకొండ, గుమ్మఘట్ట, కూడేరు, పుట్లూరు, నార్పల, రాప్తాడు, శెట్టూరు, కంబదూరు మండలాల్లో ఒకటి చొప్పున డ్రైస్పెల్స్ నమోదయ్యాయి. గుంతకల్లు, అనంతపురం రూరల్, యాడికి, తాడిపత్రి, పెద్దపప్పూరు, యల్లనూరు, అనంతపురం అర్బన్, బుక్కరాయసముద్రం మండలాల్లో రెండు చొప్పున డ్రైస్పెల్స్ నమోద య్యాయి. డి.హీరేహాళ్, కణేకల్లు, బొమ్మనహాళ్, విడపనకల్లు, గుత్తి, పెద్దవడుగూరు, వజ్రకరూరు, ఉరవకొండ, బెళుగుప్ప, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, ఆత్మకూరు, గార్లదిన్నె, శింగనమల, నార్పల, కుందుర్పి మండలాల్లో అననుకూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు గుర్తించారు. చివరకు సాధారణ వర్షపాతం నమోదు కావడం, సాగు విస్తీర్ణం కూడా ‘సాధారణం’తో పూర్తి కావడంతో కరువు జాబితాలో ఒక్క మండలం కూడా లేకుండా చేశారు.
55 రోజులు సరైన వర్షమే లేదు..
ఖరీఫ్ పంటల సాగుకు కీలకమైన జూన్, జూలై మాసాలతో పాటు ఆగస్టు 5 వరకు పరిగణనలోకి తీసుకుంటే చాలా మండలాల్లో 55 రోజుల పాటు సరైన వర్షమే కురవలేదు. అక్కడక్కడా అడపాదడపా కురిసిన తేలికపాటి వర్షాలకు పంటలు వేశారు. జూన్‌లో 61.2 మి.మీ గానూ 21.7 శాతం తక్కువగా 47.9 మి.మీ, జూలైలో 64.3 మి.మీ గానూ 46 శాతం తక్కువగా 34.7 మి.మీ వర్షం కురిసింది. ఆగస్టు 5 తర్వాత వర్షాలు పడటంతో 84.4 మి.మీ గానూ 96.6 శాతం అధికంగా 165.9 మి.మీ వర్షపాతం నమో దైంది. సెప్టెంబర్‌లో తేలికపాటి వర్షాలు కొనసాగాయి. 111.6 మి.మీకు 22.1 శాతం తక్కువగా 87 మి.మీ వర్షం కురిసింది. జూన్, జూలైతో పాటు సెప్టెంబర్‌లో కూడా తక్కువ వర్షాలు కురిసినా ఆగస్టులో కురిసిన మంచి వర్షాలకు 321.5 మి.మీ గానూ 4.3 శాతం అధికంగా 335.5 మి.మీ మేర సాధారణం నమోదైంది. నాలుగు నెలల ఖరీఫ్‌లో 28 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కాగా అందులో ఆగస్టులోనే 14 రికార్డు కాగా మిగతా మూడు నెలల్లో మరో 14 రోజులు నమోదు కావడం చూస్తే వర్షాలు ఏ స్థాయిలో గతితప్పాయో అర్థం చేసుకోవచ్చు.
అమాత్యుడి తీరుపై సర్వత్రా విమర్శలు
కరువు జాబితాలో మొండిచేయి చూపడంపై రైతుల మండిపాటు
రాయితీ విత్తన పప్పుశనగ పంపిణీలో అలసత్వంపై ఆవేదన
కరువు కానరాలేదా కేశవా?!


