కరువు నేలలో ఖరీదైన లోహం
కనగానపల్లి: ఉమ్మడి జిల్లాలో మరో విలువైన లోహ నిక్షేపాలు బయటపడ్డాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇనుము, బంగారు, వజ్రాల అన్వేషణ కోసం తవ్వకాలు జరుగుతుండగా, తాజాగా టంగ్‌స్టన్ అనే విలువైన, అరుదైన లోహ ఖనిజం ఉన్నట్లు గుర్తించారు. కనగానపల్లి మండలం బాలేపాళ్యం గ్రామ పరిసరాల్లో ఈ లోహం ముడి ఖనిజం ఉన్నట్లు తేలింది. ఖనిజ అన్వేషణ, తవ్వకాల కోసం కేంద్ర గనుల శాఖ నుంచి హిందూస్థాన్ జింక్ సంస్థ అనుమతులు పొందింది. కేంద్ర మంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా నాలుగు రోజుల క్రితం తవ్వకాల కోసం ఆ సంస్థకు అనుమతులిచ్చింది.
విలువైన, అరుదైన లోహం
టంగ్‌స్టన్ అత్యంత అరుదుగా దొరికే విలువైన లోహమని ఖనిజ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇనుము కన్నా ఎంతో దృఢమైన ఈ లోహాన్ని పారిశ్రామిక యంత్రాలు, ఎలక్ట్రిక్ విభాగాల తయారీలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇది ఎక్కువ వేడిమిని తట్టుకోగలదు. కావున విద్యుత్ బల్బుల్లో ఫిలమెంట్, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు వాడే పరికరాల్లో ఉపయోగిస్తారు. ఈ లోహం ముడి ఖనిజం విలువే టన్నుకు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుందని సమాచారం. ఈ ఖనిజం మనదేశంలో అరుదుగా లభిస్తుండటంతో ఈ లోహంతో తయారయ్యే పరికరాలను చాలావరకు మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ మధ్యనే తమిళనాడులో ఈ ముడి ఖనిజాన్ని గుర్తించినప్పటికీ అక్కడి ప్రజల వ్యతిరేకతతో తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు.
తొలి దశలో 308.30 హెక్టార్లలో తవ్వకాలు
టంగ్‌స్టన్ ముడి ఖనిజం కోసం మొదట శాటిలైట్, విమానాల ద్వారా సర్వే చేసిన భూగర్భ గనులు, ఖనిజ శాఖ వారు బాలేపాళ్యం గ్రామ పరిసరాల్లో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి తోడు ఈ ప్రాంతంలో హంద్రీ–నీవా కాలువ కోసం తీసిన టన్నెల్ వద్ద బయటపడిన రాళ్లు, మట్టిని కూడా పరిశీలించి.. టంగ్‌స్టన్ ఆనవాళ్లను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలోని 308.30 హెక్టార్లలో తొలి దశలో తవ్వకాలు నిర్వహించాలని కేంద్ర గనుల శాఖ టెండర్ నిర్వహించగా, హిందూస్థాన్ జింక్ సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ త్వరలోనే ఇక్కడ తవ్వకాలు చేపట్టే అవకాశం ఉంది.
బాలేపాళ్యం పరిసరాల్లో టంగ్‌స్టన్ నిక్షేపాలు
తవ్వకాలకు హిందూస్థాన్ జింక్ సంస్థకు అనుమతి
తొలి దశలో 308.30 హెక్టార్లలో తవ్వకాలు
కరువు నేలలో ఖరీదైన లోహం


