అనంతపురం అర్బన్: భూముల రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో జాయింట్ ఎల్‌పీఎంల సబ్ డివిజన్ ప్రక్రియ జరుగుతోందని, దీనిపై గ్రామ సభల్లో రైతులకు అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా చూడాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. సబ్‌డివిజన్ అంశంపై జేసీ గురువారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాయింట్ పట్టాదారులుగా నమోదైన రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడంలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించేందుకు జాయింట్ ఎల్‌పీఎంల సబ్ డివిజన్ చేపట్టామన్నారు. ఇందుకోసం సంబంధిత గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వద్ద రూ.50 చెల్లించాల్సి ఉంటుందన్నారు.
‘తెలుగే చదవడం లేదు.. మీరేం చేస్తున్నారు?’
కూడేరు: ‘తెలుగు అక్షరాలనే విద్యార్థులు సరిగా చదవడం లేదు. ఇలాంటి సమయంలో మీరు పర్యవేక్షణ చేయకుండా ఏం చేస్తున్నారు’ అంటూ జిల్లా విద్యాధికారి ప్రసాద్ బాబు అసహనం వ్యక్తం చేశారు. గురువారం డీఈఓ మండలంలోని ఉదిరిపికొండ అప్‌గ్రేడ్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమ్మేటివ్ అసెస్‌మెంట్ –1 పరీక్షలో భాగంగా జరుగుతున్న గణితం పరీక్షను పరిశీలించారు. ఓ విద్యార్థికి తెలుగు అచ్చు పుస్తకం ఇచ్చి చదవమని చెప్పగా.. అతడు తడబడ్డాడు. ఈ క్రమంలో హెచ్‌ఎం హరిశ్రీ తీరుపై డీఈఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. క్లాస్ టీచర్ ఎవరు.. విద్యార్థి చిన్న పదాలు కూడా చదవలేకపోతున్నాడు.. మీరు పర్యవేక్షణ చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఏకాగ్రతతో చదివితే మంచి మార్కులు సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. విద్యలో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని టీచర్లను ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ మునీర్ కాన్ తదితరులు పాల్గొన్నారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ శిక్షణకు దరఖాస్తులు
అనంతపురం రూరల్: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) శిక్షణకు జిల్లాలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బూకొఠారి తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 16 నుంచి apstudycircle.apcfss.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. స్క్రీనింగ్ పరీక్ష అనంతరం మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. ఎంపికైన వారికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లలో 5 నెలల ఉచిత శిక్షణ కల్పిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 340 మందిని శిక్షణకు ఎంపిక చేస్తారని, అందులో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తారని వెల్లడించారు.
జాయింట్ ఎల్‌పీఎంల సబ్ డివిజన్


