అక్రిడిటేషన్‌కు దరఖాస్తుల స్వీకరణ
అనంతపురం అర్బన్: జిల్లా స్థాయిలో పనిచేస్తున్న పాత్రికేయులకు రెండేళ్ల కాలపరిమితికి అక్రిడిటేషన్ జారీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో జారీ చేసిన అక్రిడిటేషన్ గడువు ఈ ఏడాది నవంబరు 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో 2026, 2027 సంవత్సరాలకు జారీ చేయనున్న నూతన అక్రిడిటేషన్‌కు నిబంధనల మేరకు అర్హులైన పాత్రికేయులు ఈ నెల 14 నుంచి https://mediarelations.ap.gov in ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అనుమానం పెనుభూతమై..
బెళుగుప్ప: భార్యపై అనుమానం పెంచుకున్న వ్యక్తి చివరకు ఆమెను హతమార్చాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుంతకల్లుకు చెందిన ఆంజనేయులుకు 15 ఏళ్ల క్రితం బెళుగుప్పకు చెందని బోయ శాంతితో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెళ్లి తర్వాత బెళుగుప్పలోనే నివాసముంటూ లారీ డ్రైవర్‌గా ఆంజనేయులు జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకుని తరచూ వేధింపులుకు గురి చేసేవాడు. గురువారం దంపతుల మధ్య గొడవ చోటు చేసుకోవడంతో శాంతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత ఆంజనేయులు కూడా అత్తింటికి చేరుకుని మారణాయుధంతో దాడి చేయడంతో శాంతి మృతి చెందింది. అనంతరం ఆంజనేయులు పోలీసులకు లొంగిపోయాడు. ఘటనాస్థలాన్ని సీఐ మహానంది, ఎస్‌ఐ శివ పరిశీలించి, కేసు నమోదు చేశారు.
కారు ఢీకొని యువకుడి మృతి
కూడేరు: కారు ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ మండలం కురగుంటలోని వైఎస్సార్ కాలనీలో నివాసముంటున్న లాలూనాయక్ కుమారుడు కృష్ణానాయక్ (30)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం వ్యక్తిగత పనిపై తన టీవీఎస్ సూపర్ ఎక్స్‌ఎల్ వాహనంపై కూడేరుకు బయలుదేరిన కృష్ణానాయక్.. రామచంద్రాపురం వద్దకు చేరుకోగానే ఎదురుగా ప్రయాణికులు దిగేందుకు బస్సు నిలిపి ఉండడంతో ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు ఢీకొంది. దీంతో తలకు బలమైన గాయమైన కృష్ణానాయక్‌ను వెంటనే అదే ఇన్నోవా వాహనంలో అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆటో బోల్తా – వృద్ధుడి మృతి
రాప్తాడు రూరల్: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని పాతూరు పవర్ ఆఫీసు నుంచి ఇటుకలపల్లికి ప్రయాణికులతో బయలుదేరిన ఆటో.. ఆర్డీటీ స్టేడియం వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళుతున్న లారీ నుంచి ఐరన్ షీట్లు కింద పడడంతో ఆటో డ్రైవర్ రాజు సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న శింగనమల మండలం చిన్నమట్లగొంది గ్రామానికి చెందిన ఇడుగూరు వెంకట్రాముడు (80)కు తీవ్ర గాయాలయ్యాయి. రమాదేవి, తస్లీం, మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకట్రాముడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఇటుకలపల్లి పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, బాధితుల ఫిర్యాదు మేరకు ఆటోను నిర్లక్ష్యంగా, అతి వేగంగా నడిపి వృద్ఢుడి మృతికి కారణమైన డ్రైవర్ రాజుతో పాటు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఎస్కేయూ మాజీ ఇన్‌చార్జ్ వీసీ శుభ కన్నుమూత
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ ఇన్‌చార్జ్ వీసీ ఆచార్య ఎంసీఎస్ శుభ (69) గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ బి.అనిత సంతాపం వ్యక్తం చేశారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శుభ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఎస్కేయూ క్యాంపస్‌లోని కెమిస్ట్రీ విభాగంలో మూడు దశాబ్దాల పాటు విశిష్టమైన సేవలు అందించారు. రెక్టార్‌గా పనిచేస్తున్న సమయంలోనే ఇన్‌చార్జ్ వీసీగా అవకాశం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా 30 మంది మహిళా ప్రొఫెసర్లను ఊటంకిస్తూ లండన్ కేంద్రంగా ప్రచురితమయిన ‘సీ ఈజ్ ఉమెన్ ఇన్ కెమిస్ట్రీ’ పుస్తకంలో శుభకు చోటు దక్కడం విశేషం. కాగా, శుభ భర్త ఆచార్య చౌడోజీరావు ఎస్కేయూలోని పాలిమర్‌సైన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు డాక్టర్ ఎంసీఎస్ శుభ అంత్యక్రియలు జరగనున్నాయి.
పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శిగా కేశవరెడ్డి
అనంతపురం సిటీ: పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శిగా డా.ఎ.కేశవరెడ్డి ఎన్నికయ్యారు. పామిడి మండలం ఖాదర్‌పేట జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్(తెలుగు)గా పని చేస్తున్న ఆయన ఎన్నికపై జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విష్ణువర్దన్‌రెడ్డి, తిమ్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
సింగపూర్ విద్యా విధానాలపై
అధ్యయన బృందంలో జిల్లా వాసులు
అనంతపురం సిటీ: సింగపూర్‌లో అమలవుతున్న విద్యా విధానాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో 78 మందిని ఎంపిక చేయగా ఇందులో జిల్లాకు చెందిన ముగ్గురికి చోటు దక్కింది. ఇందులో పామిడిలోని ఏపీమోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ యాదవ్‌అరుణ, ఆత్మకూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో పనిచేస్తున్న యు.శైలజ, గుత్తి మండలం అబ్బేదొడ్డి పాఠశాలలో పనిచేస్తున్న బండి శ్రీనివాసులు ఉన్నారు. బృందం సభ్యులతో కలసి ఈ నెల 27 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకూ వీరు సింగపూర్‌లో పర్యటించి, అక్కడి విద్యావిధానాలపై అధ్యయనం చేయనున్నట్లు డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు.
అక్రిడిటేషన్‌కు దరఖాస్తుల స్వీకరణ


