దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు : ఎస్పీ
గుంతకల్లు రూరల్: జిల్లాలో దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. గురువారం గుంతకల్లులో పర్యటించిన ఆయన రూరల్ పీఎస్‌తో పాటు డీఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించారు. నేరాల నియంత్రణకు తీసుకున్న చర్యలపై సిబ్బందితో ఆరా తీశారు. అనంతరం రూరల్ పీఎస్‌లో డీఎస్పీ శ్రీనివాస్‌తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జిల్లాలో క్రైం రేటు తగ్గిందన్నారు. కేసుల దర్యాప్తు, పోలీస్ స్టేషన్ల అడ్మినిష్ట్రేషన్ కూడా మెరుగుపడిందన్నారు. దొంగతనాలపై ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తూ వాటి నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇంటికి తాళం వేసి ఎక్కువ రోజులు బయటకు వెళ్లేవారు సమాచారం ఇస్తే వారి ఇళ్లకు ఉచితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
విలేకరులకు సమాచారం ఇవ్వకపోతే ఎలా?
యాడికి: పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులకు సంబంధించి ఎప్పటి కప్పుడు విలేకరులకు సమాచారం ఇవ్వకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, ఈ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా అంటూ యాడికి పీఎస్ రైటర్ శివపై ఎస్పీ జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం యాడికి పీఎస్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం విలేకరులు, పోలీసుల మధ్య నెలకొన్న అంతరంపై ఆరా తీశారు. కేసుల సమాచారాన్ని రాత్రి 10 గంటలైనా రైటర్ ఇవ్వడం లేదనే విషయం తెలుసుకున్న ఎస్పీ అసహనానికి లోనయ్యారు. రైటర్ శివపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్‌పీ రోహిత్‌కుమార్ చౌదరి, ఎస్‌ఐ రమణయ్య, ఏఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


