వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీల చించివేత
బ్రహ్మసముద్రం : ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వర్గ కక్షలకు ఊపిరి పోస్తున్నారు. ఇందుకు నిదర్శనమే బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురంలో టీడీపీ నేతలను రెచ్చగొట్టి వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను చింపి వేయించారు. వివరాల్లోకి వెళితే.. పాలవెంకటాపురంలో గ్రామస్తులు ఐక్యంగా కొల్లాపురమ్మ జాతర ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు తమ నేతలను స్వాగతిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలు ఉంటే ఎమ్మెల్యే అమిలినేని ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని భావించిన మండల టీడీపీ కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు వెంటనే రంగంలో దిగి గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలు పెట్టరాదని దౌర్జన్యానికి దిగాడు. ఉత్సవాలకు తమ నేతలను ఆహ్వానించామని, వారి రాకను స్వాగతిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని, అదే స్థాయిలో టీడీపీ వారు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఇందులో అభ్యంతరం ఏమిటంటూ స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నించారు. దీంతో టీడీపీ నాయకులు రెచ్చిపోయి పోలీసులను రంగంలోకి దింపారు. బ్రహ్మసముద్రం ఎస్‌ఐ నరేంద్రకుమార్ దగ్గరుండి టీడీపీ నేతలతో కలసి వైఎస్సార్‌సీపీ ప్లెక్సీలను చింపి వేయించారు. అయితే టీడీపీ ఫ్లెక్సీలను అలాగే వదిలేయడంతో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా తాము జాతర చేయాలనుకుంటే టీడీపీ నేతల దౌర్జన్యంతో వర్గ కక్షలకు ఊపిరి పోస్తున్నారని, ఇందుకు పోలీసులు కూడా తోడవ్వడం బాధాకరమని పేర్కొంటున్నారు.


