
చెర్లోపల్లి కాలనీలో పర్యటించిన వైద్యాధికారులు
గుత్తి: ‘ముగ్గురు చిన్నారులకు డెంగీ’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై వైద్యాధికారులు స్పందించారు. మండలంలోని చెర్లోపల్లి కాలనీలో మంగళవారం అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ అమర్‌నాథ్, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ప్రభాకర్, వైద్య సిబ్బంది పర్యటించారు. డెంగీ బారిన పడిన ముస్తాక్, షణ్ముఖ, వెంకటకృష్ణను నుంచి రక్త నమూనాలు సేకరించి, వైద్య పరీక్షలకు పంపారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. దోమల నివారణకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ ఉపాధ్యాయుడు మాకొద్దు!
● పాఠశాల వద్ద గ్రామస్తుల నిరసన
కుందుర్పి: మండలంలోని మహంతపురం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు జక్కెల శివశంకర్ తమ పాఠశాలకు వద్దంటూ ఆ గ్రామస్తులు మంగళవారం పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో మరో ప్రాంతానికి వెళ్లిన శివశంకర్ తిరిగి ఇదే పాఠశాలలో పనిచేసేందుకు డీఈఓ నుంచి అనుమతులు పొందినట్లుగా సోమవారం ఎంఈఓ కార్యాలయానికి ఉత్తర్వులు అందినట్లుగా తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2021లో గ్రామంలోని పాఠశాలకు బదిలీపై వచ్చిన ఆయన విధులకు సక్రమంగా హాజరు కావడం లేదంటూ వాపోయారు. ఉపాధ్యాయుడి తీరుతో పాఠ్యాంశాల్లో పిల్లలు వెనుకబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై పలుమార్లు డీఈఓకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, ఇప్పటికై నా అధికారులు స్పందించకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు. అనంతరం ఎంఈఓలు శంకరన్న, తిప్పేస్వామిని కలసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జగన్, ఎంపీటీసీ సభ్యుడు ఈరన్న, పాఠశాల కమిటీ సభ్యులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.