
భర్త మోసం.. గర్భిణి బలవన్మరణం
గుంతకల్లు టౌన్: భర్త మోసాన్ని జీర్ణించుకోలేక ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గుంతకల్లులోని సోఫియా స్ట్రీట్‌లో నివాసముంటున్న షేక్ పీర్‌బాషా పెద్ద కుమార్తె షమీమ్ భాను (33) రెండేళ్ల క్రితం తన భర్తతో విడాకులు పొంది ఐదేళ్ల కుమారుడితో కలసి తల్లిదండ్రుల సంరక్షణలో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో తన కుమారుడి పేరును రేషన్‌కార్డులో నమోదు చేయించేందుకు సచివాలయానికి వెళ్లిన సమయంలో వీఆర్‌ఓ మహమ్మద్ వలి పరిచయమయ్యాడు. ఇంటిస్థలం, ఉద్యోగం ఇప్పిస్తానని రూ.లక్ష తీసుకున్నాడు. అనంతరం 2024, మే 22న అనంతపురంలో పెద్దల సమక్షంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భిణి. ఈ క్రమంలో వీఆర్‌ఓ వలి మొదటి భార్య, ఆమె తమ్ముళ్ల నుంచి బెదిరింపులు మొదలు కావడంతో గత నెల 14న గుంతకల్లు వన్‌టౌన్ పీఎస్‌లో షమీమ్‌భాను ఫిర్యాదు చేసింది. దీంతో వీఆర్‌ఓ వలిపై పోలీసులు వేధింపుల కేసు నమోదు చేశారు. దీంతో కక్ష పెంచుకున్న వలి ఆమెను మరింత మానసిక క్షోభకు గురి చేస్తూ వచ్చాడు. కాన్పు దగ్గర పడుతున్న సమయంలో తనకు దగ్గరగా ఉండాలంటూ బుధవారం భర్తను షమీమ్ కన్నీటితో వేడుకుంది. ఆ సమయంలో వలి ఆమె పట్ల నిర్ధయగా వ్యవహరిస్తూ తీవ్ర స్థాయిలో దూషణలకు దిగాడు. చస్తే తనకు ప్రశాంతంగా ఉంటుందని మనోవేదనకు గురి చేశాడు. దీంతో భర్త తనను మోసగించాడని నిర్ధారణకు వచ్చిన ఆమె బుధవారం మధ్యాహ్నం తన ఇంట్లో విషపు గుళికలు మింగింది. అనంతరం తనకు తలనొప్పిగా ఉందని, ఆస్పత్రికి వెళ్లొస్తానని చెప్పి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేరుకోగానే అపస్మారకస్థితికి చేరుకుంది. ఆస్పత్రి సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకున్నారు. విషపు గుళికలు మింగినట్లు తెలుసుకుని వైద్యుల సూచన మేరకు వెంటనే అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గుత్తి వద్ద మృతి చెందింది. భర్త వలి మానసిక క్షోభ, మోసాన్ని తట్టుకోలేకనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తండ్రి పీర్‌బాషా చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మనోహర్ తెలిపారు.