
సారు తీరు.. బేజారు!
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగంలో రెవెన్యూశాఖ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. పరిపాలనలో ఉన్నతాధికారులు తమదైన ముద్ర వేస్తుంటారు. తమ పనితీరుతో శాశ్వతంగా గుర్తుండిపోతారు. వారి పాలనా కాలం ఉద్యోగులు, ప్రజల్లో నిరంతరం చర్చలో ఉంటుంది. అయితే ప్రస్తుతం ‘ముద్ర’ లేని పాలన సాగుతోందనే చర్చ ఉద్యోగవర్గాల్లో సాగుతోంది. క్షేత్రస్థాయి పర్యటనల కంటే వీసీలు, సమావేశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కార్యక్రమాల నిర్వహణలో నాణ్యత కోసం కంటే రికార్డుల కోసం తాపత్రయ పడడం.. నిరంతరం సమీక్షలతో అధికారులను విసుగెత్తించడం.. పర్యటనలు కాస్తా మంత్రి ఇలాకాకే పరిమితం చేయడం.. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంపై ఆసక్తి చూపకపోవడం.. ఇలా ఉన్నతాఽధికారి పాలనాతీరుపై విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి.
రికార్డుల వెంట పరుగు...
పాలనలో ముద్ర వేయడం అటుంచి రికార్డుల కోసం తాపత్రయం అధికంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఉన్నతాధి కారి తీరుతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని పలువురు జిల్లా అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్ విషయంలో ఒక్కొక్క శాఖ కనీసంగా రూ.లక్ష వరకు ఖర్చుచేసుకుంది. ఈ మొత్తం ఎలా అనేది ‘తరువాతి’ మాట. ఇక రెడ్‌క్రాస్ సభ్యత్వం తీసుకోవాలని ఒత్తిడి చేయడంతో అధికారులు, ఉద్యోగులు తప్పదన్నట్లుగా డబ్బు చెల్లించి సభ్యత్వం తీసుకున్నారు. యోగాంధ్ర రిజిస్ట్రేషన్ల విషయం, దివ్యాంగుల రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం, అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణలోనూ అధికారులు ఒత్తిడికి గురయ్యారు.
సమీక్షలతో సరి...
ఉన్నతాధికారులు సహజంగా క్షేత్రస్థాయి పర్యటనలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటి. సమీక్షలు వారంలో రెండుమూడుసార్లు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయి పర్యటనల కంటే సమీక్షలతో సరిపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. రోజుకు కనీసంగా రెండు మూడు సమీక్షలు.. ఒక్కొక్కసారి ఐదారు వరకు సమీక్షలు ఉంటాయని అధికారవర్గాలు వాపోతున్నాయి. పోనీ ఇందులో ఏమైనా ‘సారం’ ఉంటుందా... అంటే అదీ లేదని అంటున్నారు. ఒక కార్యక్రమానికి సంబంధించి బాధ్యత అప్పగించి... అందుకు గడువు నిర్దేశించి... అటు తరువాత పురోగతిపై సమీక్షిస్తే ఫలితం ఉంటుంది. కానీ రోజూ సమీక్షించడం ద్వారా కాలం వృథా తప్ప ప్రయోజనం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి ఇలాకాకే పరిమితం
ఉన్నతాధికారి అరకొరగా చేపట్టే క్షేత్రసాయి పర్యటనలూ విమర్శలకు తావిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల అమలు కార్యక్రమాలైతేనేమి... ఇతరత్రా అంశాలపై నిర్వహించే పర్యటనల్లో ఎక్కువ భాగం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గానికే పరిమితం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక ఎప్పుడైనా పర్యటనలు చేస్తే జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న మండలాలకే సరిపెడుతున్నారు తప్ప.. సుదూరంగా ఉన్న బొమ్మనహాళ్, కణేకల్లు, డీ హీరేహాళ్, బ్రహ్మసముద్రం, కంబదూరు, కుందుర్పి, విడపనకల్లు తదితర మండలాల్లో పర్యటించిన దాఖలాలు ఒకటీ అర తప్ప పెద్దగా లేవని చెబుతున్నారు.
పదోన్నతుల ఊసేలేదు...
రెవెన్యూశాఖలో పదోన్నతుల కల్పన ఊసేలేకుండా పోయింది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి డిప్యూటీ తహసీల్దారు స్థాయి వరకు పదోన్నతుల కోసం ఉద్యోగులు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు హడావుడిగా ఫైలు సిద్ధం చేయాలని చెప్పడం... అటు తరువాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిందనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పట్లో తమకు పదోన్నతులు రావనే అభిప్రాయానికి ఉద్యోగులు వచ్చారంటే పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. అధికారులు తమ చాంబర్ల సుందరీకరణకు, బంగ్లాల్లో సుందరీకరణకు లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తున్నారు. అయితే కలెక్టర్ కార్యాలయం ముందుభాగాన ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి మండపం నిర్మించాలనే ఆలోచన చేయకపోవడం కూడా వీరికే చెల్లుతుంది.
‘ముద్ర’ లేని పాలన
రికార్డుల కోసం తాపత్రయం
సమీక్షలతో విసిగిపోతున్న అధికారులు
పర్యటనలు కూడా మంత్రి ఇలాకాకే పరిమితం
ఊసేలేని పదోన్నతుల కల్పన
ఉన్నతాధికారి వ్యవహార శైలిపై
సర్వత్రా విమర్శలు