
ట్రోలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి
అనంతపురం: ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి తీర్పుపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం బార్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. బార్ కౌన్సిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని అన్ని కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి, నిరసనలో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్రాముడు, ట్రెజరర్ వెంకట రఘుకుమార్, సంయుక్త కార్యదర్శి జుబేర్, మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బడా నారాయణరెడ్డి, శ్రీకాంత్, అవ్వా సురేష్, ప్రణీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
అనంతపురం: నగరంలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు... గుంతకల్లు మండలానికి చెందిన ఓ విద్యార్థిని నగరంలోని అరవిందనగర్‌లోని బీసీ హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. గురువారం ఆమెను కలిసేందుకు వచ్చిన తండ్రి సరిగా చదవడం లేదని మందలించాడు. అయితే అందరి ముందు మందలించడంతో మనస్తాపానికి లోనైన ఆమె తన గదిలోకి వెళ్లి విషపూరిత ద్రావకం తాగింది. తోటి విద్యార్థినిలు గమనించి వెంటనే సర్వజనాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.