
జేసీ ఇలాకాలో దాహం కేకలు
యాడికి: జేసీ ప్రభాకరరెడ్డి ఇలాకాలో తాగునీటి కోసం ప్రజలు విలవిల్లాడుతున్నారు. గుక్కెడు నీరు లభ్యం కాక పోవడంతో దాహం తీరడం లేదని వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు మరిచి గ్రామాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు ఇవ్వండి మహాప్రభో అంటూ తరచూ మహిళలు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నా.. అటు ప్రజాప్రతినిధులు కానీ, ఇటు అధికారులు కాని పట్టించుకోకపోవడంతో ఇప్పట్లో తాగునీటి ఇక్కట్లు దూరమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
తాజాగా పిన్నేపల్లిలో..
తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి పంచాయతీ పరిధిలోని పిన్నేపల్లి గ్రామ మహిళలు గురువారం తాగునీటి కోసం రాస్తారోకో చేపట్టారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెలల తరబడి తమకు తాగునీరు అందడం లేదని వాపోయారు. పలుమార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో చివరకు ఇలా మండల కేంద్రానికి చేరుకుని నిరసన తెలపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ వెంకటేసు, పంచాయతీ ఇన్‌చార్జ్ ఈఓ శశికళ అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని స్పష్టమైన హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు.