
పనిముట్టును ఆయుధంగా చూపి కేసులా?
● పోలీసుల తీరుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
తాడిపత్రిటౌన్: పొలాల్లో ఉపయోగించే పనిముట్టును ఆయుధంగా చూపి వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు నమోదు చేస్తారా అని పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమ అరెస్ట్‌లు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. మూడు రోజుల క్రితం పెద్దపప్పూరు మండలం వరదాయపల్లికి చెందిన ఆరుగురు వైఎస్సార్‌సీపీ నాయకులు తాడిపత్రిలో కోర్టుకు హాజరయ్యేందుకు వస్తే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు 3 రోజులు నిర్బంధించారన్నారు. పొలాల్లో ఉపయోగించే పనిముట్టును ఆయుధంగా పేర్కొని మారణాయుధం లభించిందంటూ కేసు నమోదు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సజ్జలదిన్నెలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాయి లేకపోతే అతని ఆచూకీ తెలపాలని అతని బంధువును పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి నిర్బంధించినట్లు ఆరోపించారు. అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రాజేష్‌ను మారణాయుధం కలిగి ఉన్నాడని పోలీసులు నిర్బంధించారని పేర్కొన్నారు. జేసీ ప్రోద్బలంతోనే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇబ్బందులు పడుతున్న నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని, బాధిత కుటుంబ సభ్యులతో కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. పోలీసులు ఎవరి మెప్పు కోసమో పోయి భవిష్యత్తులో తిప్పలు పడొద్దని పెద్దారెడ్డి హితవు పలికారు.