
బ్రిడ్జి నాణ్యత ప్రశ్నార్థకమే!
కణేకల్లు: హెచ్చెల్సీ ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. కొందరు కాంట్రాక్టర్లు నిబంధనలు తుంగలో తొక్కి పనులు చేస్తున్నా అధికారులు పట్టించుకోక పోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే సెంట్రింగ్ పనులు నిబంధనలకు విరుద్ధంగా పూర్తి చేశారు. హెచ్చెల్సీకి నీరు వస్తే బ్రిడ్జిలు కూలిపోక తప్పదనే భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది.
మట్టి పరిచి.. స్లాబ్ వేసి
కణేకల్లు మండలం నాగేపల్లి గ్రామ సమీపంలో 155 కిలోమీటర్ వద్ద శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జి గత ఏడాది కుప్పకూలిన విషయం తెలిసిందే. హెచ్చెల్సీ ఆధునికీకరణ పనుల్లో భాగంగా ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.20 కోట్లను మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించేలా చూడాల్సిన హెచ్చెల్సీ అధికారులు ఇందుకు విరుద్ధంగా కాలయాపన చేశారు. దీంతో పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మరో వైపు పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. హెచ్చెల్సీకి నీటివిడుదల సమయం దగ్గరపడడంతో పనులు తొందరగా పూర్తి చేయాలంటూ అధికారులు ఒత్తిళ్లు మొదలు పెట్టారు. దీంతో కాంట్రాక్టర్ నిబంథనలకు పాతర వేస్తూ పనులు చేపట్టినా నోరు మెదపడం లేదు. బ్రిడ్జి స్లాబ్ వేయాలంటే ముందుగా సెంట్రింగ్ వర్క్ చేయాలి. స్కాఫ్ ఫోల్డింగ్ సెంట్రింగ్ వర్క్ చేసిన తర్వాత ఐరన్ వర్క్ చేయాల్సి ఉంది. అయితే ఇవేవీ చేయకుండానే స్కాఫ్ ఫోల్డింగ్ సెంట్రింగ్ స్థానంలో బ్రిడ్జికి మట్టి పరిచి సోమవారం స్లాబ్ కాంక్రీట్ పని పూర్తి చేశారు.
ఏ స్లాబ్‌కై నా 28 రోజులు సెంట్రింగ్
ఉండాల్సిందే
ఇళ్లయినా, ప్రభుత్వ భవనాలైనా స్లాబ్ వేస్తే టెక్నికల్‌గా 28 రోజులు సపోర్ట్‌గా సెంట్రింగ్ ఉంచాలి. మరీ అత్యవసరమైతే కనీసం 21 రోజులైనా సెంట్రింగ్ ఉంచాలి. అయితే ఇందుకు విరుద్ధంగా నాగేపల్లి బ్రిడ్జి సెంట్రింగ్ స్కాఫ్ ఫోల్డింగ్ సెంట్రింగ్ కాకుండా మట్టితో ఫిల్లింగ్ చేసి స్లాబ్ వేశారు. హెచ్చెల్సీకి 10వ తేది నీరు విడుదల చేస్తే కణేకల్లు ప్రాంతానికి 12వ తేదీ చేరుతాయి. ఈ క్రమంలో నీటి సరఫరాకు సెంట్రింగ్ కోసం వేసిన మట్టి అడ్డంకిగా మారనుంది. దీంతో అధికారులు మట్టిని కచ్చితంగా తొలగించాలి. మట్టి తొలగిస్తే సెంట్రింగ్ సపోర్ట్ లేక బ్రిడ్జి కూలిపోయే ప్రమాదముంది. ప్రస్తుతం ఈ అంశం రైతుల్లో చర్చనీయాంశమైంది.
సెంట్రింగ్ తీసేస్తే...
వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని 35 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పుతో బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. 35 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జికి మధ్యలో పిల్లర్లు కూడా ఉన్నాయి. ఈ పిల్లర్లపై ఐరన్ బీమ్ వేశారు. సెంట్రింగ్ మట్టి తీసేస్తే ఐరన్‌బీమ్ సపోర్ట్‌తో స్లాబ్‌కు ఎలాంటి ముప్పు ఉండదని అధికారులు పేర్కొంటున్నా.. కచ్చితంగా బ్రిడ్జికి ముప్పేనని పలువురు సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 12 ఇంచుల (ఒక అడుగు) మందంతో వేసే కాంక్రీట్ స్లాబ్‌కు కనీసం సెంట్రింగ్ సపోర్ట్ 21 రోజులైనా ఉండాలని అంటున్నారు. అంతకు తక్కువ వ్యవధిలో సెంట్రింగ్ మట్టి తీసేస్తే బ్రిడ్జి వంగి పోతుందని పేర్కొంటున్నారు.
డబ్బు మిగిల్చుకునేందుకేనా?
స్కాఫ్ ఫోల్డింగ్ సెంట్రింగ్ వర్క్‌కు నిర్వాహకులు రూ.10లక్షలు అడిగినట్లు తెల్సింది. అంత ఖర్చు పెట్టే యోచన లేని కాంట్రాక్టర్ తన స్వలాభం కోసం స్కాఫ్ ఫోల్డింగ్ సెంట్రింగ్‌ను కాదని మట్టితో ఫిల్లింగ్ చేసి బ్రిడ్జి సెంట్రింగ్ పనులు పూర్తి చేశారు. ఈ విషయం తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా సెంట్రింగ్ పనులు
స్కాఫ్ ఫోల్డింగ్ మట్టితో కాలువ నింపి నాలుగు రోజుల క్రితం బ్రిడ్జి స్లాబ్ వేసిన వైనం
నేడు హెచ్చెల్సీకి నీరు విడుదల అవకాశం
ఇదే జరిగితే రెండు రోజుల్లో కణేకల్లు ప్రాంతానికి నీరు
మట్టి తొలగిస్తే తప్ప ముందుకు సాగని నీరు
మట్టి సపోర్ట్ తొలగిస్తే కూలనున్న బ్రిడ్జి

బ్రిడ్జి నాణ్యత ప్రశ్నార్థకమే!