
పెరటి కోళ్ల పెంపకంతో ఆదాయం
శింగనమల: పెరటి కోళ్ల పెంపకంతో మెరగైన ఆదాయాన్ని పొందవచ్చునని రైతులకు కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ మాధవి సూచించారు. శింగనమల మండలం సోదనపల్లిలో పెరటి కోళ్ల పెంపకంపై బుధవారం రైతులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కేవికే ఆధ్వర్యంలో పంటల సాగు, కోళ్ల పెంపకం, పనిముట్లు, విలువ ఆధారిత పదార్థాల తయారీపై ఇస్తున్న శిక్షణ కార్యాక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశువైద్యాధికారి డాక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పశు పోషణ, పశువుల ఆరోగ్యం కాపాడుకోవడం తదితర అంశాలపై చైతన్య పరిచారు. గొర్రెల సంరక్షణ చర్యలను వివరించారు. గొర్రెల పెపంకం దారులు మందలో పొట్టేలు మార్పిడి చేస్తుండడం వల్ల బ్రుసెల్లోసిస్ వ్యాధిని ఆధిగమించవచ్చునన్నారు. కార్యక్రమంలో పశు వైద్యులు శ్రీహర్ష, తిరుపాలరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ఆగస్టు 21న స్టార్టప్ పోటీలు
అనంతపురం: దివ్యాంగుల ఇంక్యుబేటర్ డీ హబ్ ఆధ్వర్యంలో హైడియాథన్ స్టార్టప్ పోటీలు నిర్వహించనున్నారు. ఆగస్టు 21న జరిగే ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్లను బుధవారం ఎస్కేయూలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈఓ డాక్టర్ సి. చంద్రమౌళి, వీవ్ మీడియా ఈవెంట్ మేనెజ్‌మెంట్ కంపెనీ సీఈఓ కొప్పుల వసుంధర, డి హబ్ ఇంక్యుబేటర్ ప్రతినిధి సతీష్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న విద్యార్థులు, ఇన్నోవేటర్స్, స్టార్టప్ ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చునన్నారు. పోటీల్లో గెలిచిన వారికి ఫ్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డుతో పాటు రూ.లక్ష నగదు పురస్కారం, అఫ్ స్కిల్లింగ్, మెంటర్‌షిప్‌తో పాటు పెట్టుబడులకు అవకాశం కల్పిస్తారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతకు సూచించారు.
ఓనర్ నిర్లక్ష్యంపై కేసు నమోదు
కొత్తచెరువు: యువకుడి మృతికి కారణమైన ఐచర్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు కొత్తచెరువు పోలీసులు తెలిపారు. వివరాలను బుధవారం వెల్లడించారు. అనంతపురంలోని రాణినగర్‌లో నివాసముంటున్న పచ్చిపాల రామాంజినమ్మ కుమారుడు పి. రాజశేఖర్ (34).. అదే నగరానికి చెందిన ఐచర్ యజమాని అశోక్ వద్ద డ్రైవర్‌గా పనిచేసేవాడు. పోతలకుంట గ్రామ సమీపంలో జరుగుతున్న హంద్రీనీవా కాలవ పనులకు అవసరమైన జనరేటర్‌ను తన ఐచర్ వాహనంలో అమర్చి అశోక్ ఆద్దెకు ఇచ్చాడు. వాహనంతో పాటు డ్రైవర్ రాజశేఖర్ ఉన్నాడు. జనరేటర్ నిర్వహణకు ప్రత్యేకంగా సాంకేతిక నిపుణుడిని ఏర్పాటు చేయాలిఉండగా ఇందుకు విరుద్ధంగా రాజశేఖర్‌తోనే ఆ పనులూ చేయిస్తూ వచ్చాడు. గత నెల 22న సాయంత్రం 5 గంటలకు జనరేటర్‌లో నీళ్లు పోయాలని రాజశేఖర్‌ను అశోక్ పురమాయించాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి జనరేటర్ రింగ్‌కు తగలడంతో రాజశేఖర్ కుడికాలు బొటన వేలు తెగిపడింది. చికిత్స కోసం తొలుత అనంతపురానికి అనంతరం కర్నూలులోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 7న రాజశేఖర్ మృతి చెందాడు. ఘటనపై బుధవారం మృతుడి తల్లి రామాంజినమ్మ ఫిర్యాదు మేరకు ఐచర్ యజమాని అశోక్‌పై కేసు నమోదు చేసి,, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.