
యువతి అనుమానాస్పద మృతి
అనంతపురం: నగరంలోని సవేరా ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు దివ్య (22) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ గ్రామానికి చెందిన వడ్డె దివ్య.. మూడేళ్లుగా సవేరా ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. అదే ఆస్పత్రికి చెందిన హాస్టల్‌లోనే ఉంటున్నారు. ఆరోగ్యం బాగోలేదని మంగళవారం రాత్రి తోటి నర్సులకు తెలిపి ట్యాబ్లెట్లు వేసుకుని నిద్రించారు. బుధవారం మధ్యాహ్నమైనా ఆమె లేవలేదు. మధ్యాహ్నం షిఫ్ట్ నర్సులు వచ్చి పలుకరించినా స్పందన లేకపోవడంతో పల్స్ పరిశీలించారు. నాడి చిన్నగా కొట్టుకుంటుండడంతో వెంటనే సవేరా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, దివ్య మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ముగ్గురిపై కేసు నమోదు
యాడికి: స్థానిక పంచాయతీ పరిధిలోని కొట్టాలపల్లిలో రెండు కుటుంబాల మధ్య మంగళవారం ఘర్షణ చోటు చేసుకున్న ఘర్షణలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన మల్లికార్జున, రమేష్ ఎదురెదురుగా ఉన్న ఇళ్లలో నివాసముంటున్నారు. చిన్నపాటి గొడవ కారణంగా మంగళవారం ఇద్దరి మధ్య మాటామాట పెరిగి మల్లికార్జునపై రమేష్, సురేష్, ప్రశాంత్ దాడి చేశారు. గాయపడిన మల్లికార్జున ఫిర్యాదు మేరకు ముగ్గురిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పశువులు తరలిస్తున్న
కంటైనర్ పట్టివేత
రాయదుర్గం టౌన్: పశువులను తరలిస్తున్న కంటైనర్‌ను గోరక్షకదళ్, వీహెచ్‌పీ నాయకులు అడ్డుకుని పోలీసుకలు అప్పగించారు. బుధవారం సాయంత్రం ఓ కంటైనర్‌లో దాదాపు 20కి పైగా పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించిన గో రక్షకదళ్ అధ్యక్షుడు ప్రశాంత్‌యాదవ్, వీహెచ్‌పీ నేతలు రాజేష్, మల్లికార్జున తదితరులు అనంతపురం ప్రధాన రహదారిలో రైల్వేగేటు వద్ద అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కంటైనర్‌ను స్వాధీనం చేసుకుని పీఎస్‌కు తరలించారు. బళ్లారి నుంచి అనంతపురానికి పశువులను తరలిస్తున్నట్లు డ్రైవర్ పేర్కొన్నట్లు తెలిపారు. చట్టవిరుద్దంగా తరలిస్తున్నందున కేసు నమోదు చేయాలని వీహెచ్‌పీ నాయకులు డిమాండ్ చేశారు.
యువతి అదృశ్యం
పెద్దవడుగూరు: మండలంలోని క్రిష్టిపాడు గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి మంగళవారం నుంచి కనిపించడం లేదు. పామిడి మండలం గజరాంపల్లి గ్రామం వద్ద ఉన్న గ్రీన్ గార్మెంట్స్‌లో పనిచేస్తున్న ఆమె.. మంగళవారం ఉదయం విధులకు బస్సుల్లో వెళ్లింది. సాయంత్రం ఇంటికి చేరుకోకపోవడంతో తల్లితండ్రులు ఆరా తీశారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.