
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి
బుక్కరాయసముద్రం: మండలంలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడి భయానక వాతావరణం సృష్టించారు. బుధవారం రాత్రి బీకేఎస్ మండలం చెన్నంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన మేరకు.. గ్రామంలో పీర్ల పండుగతో పాటు వైఎస్సార్ జయంతిని మంగళవారం అందరూ సంతోషంగా జరుపుకున్నారు. అయితే వైఎస్సార్ జయంతి వేడుకలను ఓర్వలేని టీడీపీ నాయకుడు మల్లికార్జునరెడ్డి, ఆయన అనుచరులు 25 మంది బుధవారం రాత్రి కట్టెలతో, కొడవళ్లతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లపైకి దాడికి తెగబడ్డారు. దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు లక్ష్మీరెడ్డి, వెంకటరమణ, వెంకటస్వామి, నారాయణస్వామి, ఈశ్వరయ్య, వెంకటేశ్వరమ్మ, దాసన్నగారి బాబు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంనటే 108 అంబులెన్స్ ద్వారా అనంతపురంలోని జీజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న శింగనమల నియోజవకర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ శైలజ నాథ్, పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంతరెడ్డి... జీజీహెచ్‌కుచేరుకుని బాధితులను పరామర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.