
దళితులపై దాడి చేసిన వారిని శిక్షించండి
● వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆంజనేయులు డిమాండ్
గార్లదిన్నె: మండలంలోని పాత కల్లూరులో దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంత్రి ఆంజనేయులు డిమాండ్ చేశారు. జరిగిన ఘటనపై బాధితులు, దళిత సంఘాల నాయకులతో కలసి బుధవారం గార్లదిన్నె పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7న పాత కల్లూరులో మొహర్రం వేడుకలు సందర్భంగా దళిత సోదరులు అభి, సంతోష్ అలావ్ తొక్కుతుండగా అదే గ్రామానికి చెందిన కొందరు అడ్డుకుని దుర్భాషలాడారు. దళితులు తమ ముందు అలావ్ తొక్కరాదంటూ బెదిరింపులకు దిగారు. ఆ సమయంలో గ్రామపెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మంగళవారం రాత్రి చర్చల పేరుతో నాగార్జున, రాజు, రామయ్యతో పాటు మరో 8 మంది పాత కల్లూరులో ఉన్న అభి, సంతోష్‌ను పిలుచుకెళ్లి దాడి చేశారు. అడ్డుకోబోయిన సంతోష్ తల్లి సుగుణమ్మపై కూడా దాడి చేశారు. గమనించిన స్థానికులు వెంటనే అడ్డుకుని క్షతగాత్రులను అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో శింగనమల నియోజకవర్గ ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు నాగరాజు, జైభీమ్ రామాంజనేయులు, పాత కల్లూరు ఎస్సీ కాలనీ వాసులు పాల్గొన్నారు. కాగా, ఘటనకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ గౌస్‌మహమ్మద్ బాషా తెలిపారు.