
‘కలుషిత నీరు కలకలం’పై విచారణ
గుంతకల్లు: పట్టణంలో కలుషిత నీరు తాగి పలువురు అస్వస్థతకు గురైన అంశంపై అధికారులు విచారణ చేపట్టారు. గుంతకల్లులోని 11వ వార్డులో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనపై ‘కలుషిత నీరు కలకలం’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై ప్రజారోగ్యశాఖ ఎస్‌ఈ రామ్మోహన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహమ్మద్ స్పందించారు. ఆదివారం ఉదయం మున్సిపల్ అధికారులతో కలసి వారు 11వ వార్డులోని సాయికృష్ణ ఆస్పత్రిలో సమీపసంలోని వీధిలో పర్యటించారు. కలుషిత నీటి సరఫరాపై వివరాలు ఆరా తీశారు. ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా తీశారు. అటు నుంచి నేరుగా మున్సిపల్ కమిషనర్ చాంబర్‌కు చేరుకుని అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సమ్మర్ సోర్టేజ్ ట్యాంకులను క్రమం తప్పకుండా తనిఖీ చేయడంతోపాటు అక్కడ చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. పైపులైన్ లీకేజ్‌లతోపాటు మురికి కాలవలో ఉన్న తాగునీటి పైపులైన్ గుర్తించి వాటిని మార్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరు ప్రైవేట్ ప్లాంట్‌ల నిర్హాకులు సరఫరా చేసిన ప్యూరిఫైడ్ నీటిని తాగిన వారున్నారని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టినట్లు తెలిపారు. ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఈ షబానా, ఏఈ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ఫిల్టర్‌బెడ్స్ పరిశీలన
గుంతకల్లు టౌన్: స్థానిక తిలక్‌నగర్‌లో కలుషిత నీరు తాగి పలువురు ఆస్పత్రి పాలైన నేపథ్యంలో ఆదివారం ఉదయం పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ రామ్మోహన్‌రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. తిలక్‌నగర్‌లో కొళాయి ద్వారా సరఫరా అయిన నీటిలో నాణ్యతా పరీక్షలు చేపట్టగా, నీరు కలుషితం కాలేదని తేలినట్లు వెల్లడించారు. అనంతరం సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్‌లో నీటినిల్వలతో పాటు ఫిల్టర్‌బెడ్స్‌ను పరిశీలించారు. ఈఎల్‌ఎస్‌ఆర్ ట్యాంకు నుంచి సేకరించిన నీటిని పరీక్షల నిమిత్తం కర్నూలులోని మెడికల్ కళాశాల ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. ల్యాబ్ రిపోర్టు రాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహమ్మద్, ఎంఈ ఇంతియాజ్, ఇతర అధికారులు ఉన్నారు.

‘కలుషిత నీరు కలకలం’పై విచారణ