
ఫైనాన్స్ కంపెనీలకు కుచ్చు టోిపీ
తాడిపత్రి టౌన్: నకిలీ ధ్రువీకరణ పత్రాలను ఫైనాన్స్ కంపెనీల్లో దాఖలు చేసి కొనుగోలు చేసిన వాహనాలను సగం ధరకే ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఆరుగురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రి పట్టణ పీఎస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఏఎస్పీ రోహిత్‌కుమార్ వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన కొందరు ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులు జిల్లా ఎస్పీకి చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాడిపత్రి ప్రాంతంలోనే వందల సంఖ్యలో వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు పక్కా ఆధారాలతో తాడిపత్రికి చెందిన గయాజుద్దీన్, కలీముల్లా, ఇంతియాజ్, రోషన్, ముస్తాఫా ఖాధ్రీ, అనంతపురానికి చెందిన నూర్‌మహమ్మద్‌ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో వాస్తవాలు బహిర్గమతయ్యాయి. ద్విచక్రవాహనాలతో పాటు కార్లు, ట్రాక్టర్లు, లారీలను సైతం వీరు సగం ధరకే విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకూ 92 ద్విచక్ర వాహనాలు, ఓ ఫోర్‌వీలర్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై శుక్రవారం కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ ముఠాలోని మరికొందరు సభ్యులు అజ్ఞాతంలో ఉన్నారని త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని ఏఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రతి రెండు రోజులకు ఒకసారి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఎవరైనా సగం ధరకే వాహనాలు కొనుగోలు చేసి ఉంటే స్వచ్ఛందంగా పోలీసులకు అప్పగిస్తే వారిని బాధితులుగా గుర్తిస్తామని పేర్కొన్నారు. ఈ అంశంలో నిర్లక్ష్యం వహిస్తే వారిని కూడా బాధ్యులుగా గుర్తిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సీఐ సాయిప్రసాద్, ఎస్‌ఐ గౌస్ పాల్గొన్నారు.
ఆరుగురు కేటుగాళ్ల అరెస్ట్
92 ద్విచక్రవాహనాలు, ఆటో స్వాధీనం