
ఫీజు బకాయిలు చెల్లించండి
రాయదుర్గం టౌన్: వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారో మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి, కోశాధికారి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సుపరిపాలన సంబరాలు చేసుకోవడం కాదు.. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన నిధులు విడుదల చేయాలనే డిమాండ్‌తో వందలాది మంది విద్యార్థులతో కలిసి శుక్రవారం రాయదుర్గంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.6,400 కోట్లను తక్షణమే విడుదల చేయాలన్నారు. బకాయిలు విడుదలకాకపోవడంతో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్‌నాయక్, నియోజకవర్గ అధ్యక్షుడు శశి, ఉపాధ్యక్షుడు తరుణ్, మున్నా, నవీన్, సచిన్, నాగరాజు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా