
హౌస్‌సర్జన్లకు ౖస్టెఫండేదీ?
● మూడు నెలలుగా అందని వైనం ● మంత్రి ఉన్నా దుస్థితి
అనంతపురం మెడికల్: కూటమి ప్రభుత్వంలో స్టైఫండ్ అందక హౌస్‌సర్జన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాక్షాత్తు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇలాకాలోని అనంతపురం సర్వజనాస్పత్రిలో విధులు నిర్వర్తించే హౌస్‌సర్జన్లకు సకాలంలో స్టైఫండ్ అందకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. వివరాలు.. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ప్రస్తుతం 2కే20 బ్యాచ్‌కు చెందిన హౌస్‌సర్జన్లు 149 మంది ఉన్నారు. వీరికి మూడు నెలల నుంచి స్టైఫండ్ అందడం లేదు. హౌస్‌సర్జన్లు 24 గంటలూ విధుల్లో ఉంటారు. ఓపీల్లో రాత్రి వేళ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంతో మంది పేద, సామాన్య మధ్యతరగతి కుటుంబాల పిల్లలు నీట్‌లో అర్హత సాధించి ఎంబీబీఎస్ చివరి దశకు వచ్చారు. ఈ క్రమంలో సకాలంలో స్టైఫండ్ అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజనాస్పత్రి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇక.. ఆస్పత్రిలో 50 మంది హౌస్‌సర్జన్లకు మాత్రమే డైట్ అందిస్తున్నారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో హౌస్‌సర్జన్లకు డైట్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ప్రగల్బాలు పలుకుతున్న వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ముందు భావి వైద్యుల కష్టాలు తీర్చాలని పలువురు అంటున్నారు.