ఓటు అడిగేందుకు వచ్చి కండువాలు కప్పుతారా? | Sakshi
Sakshi News home page

ఓటు అడిగేందుకు వచ్చి కండువాలు కప్పుతారా?

Published Sat, Apr 20 2024 2:00 AM

విలేకరులతో మాట్లాడుతున్న అల్లాబకాష్‌ దంపతులు  - Sakshi

వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం నాయకులు

గుంతకల్లు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ పార్టీ నాయకుడైనా ప్రజలను కలసి ఓటు వేయాలంటూ అభ్యర్థించవచ్చునని, అయితే ఇంట్లోకి వచ్చిన తర్వాత బలవంతంగా పార్టీ లో చేరుతున్నట్లు ప్రకటించి కండువాలు కప్పి వెళ్లిపోవడం సబబు కాదని వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడు బట్నాపాడు అల్లాబకాష్‌ దంపతులు హితవు పలికారు. గుంతకల్లులో స్థిరపడిన గుమ్మనూరు సమీపంలోని బట్నాపాడుకు చెందిన అల్లాబకాష్‌ ఇంటికి శుక్రవారం ఉదయం టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం సోదరుడు శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్‌ అన్వర్‌ చేరుకున్నారు. కాసేపు ఇతర అంశాలపై మాట్లాడిన తర్వాత టీడీపీ కండువాలు కప్పి ఫొటోలు తీసి, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అల్లాబకాస్‌ దంపతులు వెంటనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఖండించారు. తమ కుమారుడు బుల్లెట్‌ సత్తార్‌ వైఎస్సార్‌సీపీలో ఉన్నాడని, తామంతా వైఎస్సార్‌సీపీకే మద్దతుదారులుగా ఉన్నామని చెప్పినా వినకుండా బలవంతంగా కండువాలు కప్పి తప్పుడు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు.

దొంగచాటు రాజకీయాలు వద్దు

దొంగ రాజకీయాలకు గుమ్మనూరు సోదరులు తెరలేపడం సరికాదని వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం నాయకులు హితవు పలికారు. ఈ విధానాలకు స్వస్తి పలకాలని సూచించారు. శుక్రవారం వైవీఆర్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మైమున్‌, మైనార్టీ సీనియర్‌ నాయకులు ఫ్లయింగ్‌ మాబు, నూర్‌ నిజామి, గఫార్‌ఖాన్‌, బుల్లెట్‌ సత్తార్‌, కాంట్రాక్టర్‌ జిలాన్‌ మాట్లాడారు. బెంచి కొట్టాలలో నివాసముంటున్న అల్లాబకాష్‌ ప్రముఖ వ్యక్తి అని గుర్తు చేశారు. వారి అనుమతి లేకుండా టీడీపీ కండువా కప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ తరహా రాజకీయాలు ఇప్పటి వరకూ గుంతకల్లులో ఏనాడూ చూడలేదని, వలస రాజకీయాలతో ఇక్కడకు వచ్చిన గుమ్మనూరు సోదరులు కొత్త సంప్రదాయాలకు తెరలేపడం సిగ్గుచేటని విమర్శించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement