సార్‌, ఆపండి ప్రజలేం పిచ్చోళ్లు కాదు.. | Sakshi
Sakshi News home page

సార్‌, ఆపండి ప్రజలేం పిచ్చోళ్లు కాదు..

Published Fri, Apr 12 2024 12:35 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: చంద్రబాబు ఎప్పుడు ఏ మాట మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు. సెల్ఫ్‌ గోల్‌ ఎప్పుడు చేసుకుంటారో తెలియదు. ఆయన సంగతేమో కానీ, చంద్రబాబు తీరుతో ఆ పార్టీ అభ్యర్థులు, కేడర్‌ మాత్రం తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఎక్కడ చూసినా బాబు వ్యాఖ్యల్ని సామాజిక మాధ్యమాల్లో వింటూ ఓటర్లు అసంతృప్తితో పాటు అసహనం వ్యక్తం చేస్తుండడంతో టీడీపీ టికెట్లు దక్కించుకున్న వారు తలలు పట్టుకుంటున్నారు. అసలే పరిస్థితి కష్టంగా ఉంది, ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలో అనే ఆందోళనలో ఉన్న తాము.. చంద్రబాబు వ్యాఖ్యలతో అభాసుపాలు కావాల్సి వస్తోందంటూ తమ సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

కొంపముంచిన టిప్పర్‌ డ్రైవర్‌ వ్యాఖ్యలు

ఇటీవల బుక్కరాయసముద్రం పర్యటనకు వచ్చిన చంద్రబాబు శింగనమల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి వీరాంజనేయులును ఉద్దేశించి టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చారని, వేలిముద్ర వేసే వ్యక్తి అంటూ హేళన చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. డ్రైవర్లందరూ భగ్గుమన్నారు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కించపరుస్తారా అంటూ ఆ సామాజిక వర్గం వారు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవానికి వీరాంజనేయులు ఎంఏ (ఎకనామిక్స్‌)తో పాటు బీఈడీ చదివారు. ఉన్నత విద్యావంతుడు. అవన్నీ తెలుసుకోకుండా, కనీస అవగాహన లేకుండా వేలిముద్ర వేసేవాడంటూ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఓటమికి బాటలు వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

కామెడీగా మారిన కరెంటు ఉత్పత్తి

అదే రోజు రాప్తాడుకు వెళ్లిన చంద్రబాబు..రైతులు పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసి, వాడుకోగా మిగిలింది ప్రభుత్వానికి ఇచ్చేలా చేస్తానని అన్నారు. అసలు పొలంలో కరెంటు ఉత్పత్తి ఏమిటి, మిగిలింది ప్రభుత్వానికి ఇవ్వడం ఏమిటి అంటూ బాబు వ్యాఖ్యలు పెద్ద కామెడీగా మారాయి. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు మాటలు వింటూ పగలబడి నవ్వుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. కావాలనే మాట్లాడారా..లేక వృద్ధాప్యం కారణంగా జరిగిందా అని ఓటర్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

వలంటీర్లపై నాలుక మడత..

గతంలో వలంటీర్లను గోనె సంచులు మోయడానికా అని చంద్రబాబు అన్నారు. చివరకు వారి ద్వారా పెన్షన్‌ పంపిణీ జరగకుండా చేశారు. దీంతో పింఛన్‌దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబును తిట్టిపోశారు. ఇప్పుడేమో వలంటీర్లకు నెలకు రూ.10 వేలు ఇస్తామనడంతో బాబును జనం ఈసడించుకుంటున్నారు. నాణ్యమైన మద్యం అందిస్తా, జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అంటూ అలవిగాని హామీలు కురిపించడాన్ని కూడా తప్పుపడుతున్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ప్రాజెక్టులు పూర్తి చేయలేని ఆయన ఇప్పుడేం చేస్తారని చర్చించుకుంటున్నారు. అయితే, చంద్రబాబుకేమో గానీ ఆయన వ్యాఖ్యలు తమకు ప్రతిబంధకంగా మారుతున్నాయని ఆ పార్టీ అభ్యర్థులు వాపోతున్నారు. తన మాటలతో తమ కొంప ముంచుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత వైఖరితో ఆ పార్టీ కేడర్‌ కూడా ఆందోళనకు గురవుతోంది.

బాబు మాటలు.. ‘దేశం’లో గుబులు

టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చారన్న వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం

కామెడీగా మారిన

కరెంటు ఉత్పత్తి వ్యాఖ్యలు

నాణ్యమైన మద్యం అందిస్తానని చెబుతుండటంపై మహిళల్లో అసంతృప్తి

తాజాగా వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తాననడంతో గందరగోళం

ప్రజల్లో చులకన చేస్తున్నారంటూ టీడీపీ నాయకుల అసంతృప్తి

టికెట్లు దక్కించుకున్న

అభ్యర్థుల్లో ఆందోళన

1/1

 
Advertisement
 
Advertisement