ఇప్పటికే 16 సబ్‌ స్టేషన్లు ప్రారంభం | Sakshi
Sakshi News home page

ఇప్పటికే 16 సబ్‌ స్టేషన్లు ప్రారంభం

Published Thu, Dec 14 2023 12:20 AM

- - Sakshi

లో ఓల్టేజీ సమస్యలకు చెక్‌

ఉమ్మడి జిల్లాకు 37 అదనపు సబ్‌ స్టేషన్లు

రూ.81 కోట్ల నిధుల మంజూరు

ఇప్పటికే 16 సబ్‌ స్టేషన్లు ప్రారంభం

మరో 21 సబ్‌ స్టేషన్ల నిర్మాణాలు 90 శాతం పూర్తి

అనంతపురం టౌన్‌: ఉమ్మడి జిల్లాలో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా దిశగా ఆ సంస్థ అడుగులు వేస్తోంది. లో ఓల్టేజీ సమస్యకు పూర్తిస్థాయిలో శాశ్వత పరిష్కారం చూపేందుకు అదనపు విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 261 సబ్‌ స్టేషన్ల ద్వారా వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. కొన్ని సబ్‌ స్టేషన్లకు సుదూర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు లో ఓల్టేజీ సమస్య ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆరు విద్యుత్‌ డివిజన్ల పరిధిలో 37 అదనపు సబ్‌ స్టేషన్ల నిర్మాణం కోసం రూ.81.4కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయిన 16 సబ్‌స్టేషన్లను అధికారులు ప్రారంభించారు. మిగిలిన 21 సబ్‌ స్టేషన్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో సాగుతున్నాయి. ఈ నెలాఖరులోపు 100 శాతం పనులు పూర్తయ్యే విధంగా కాంట్రాక్టర్లకు విద్యుత్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాటి నిర్మాణ పనులు పూర్తయితే జిల్లా వ్యాప్తంగా వినియోగదారులకు లో ఓల్టేజీ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అవుతుంది.

అనంతపురం రూరల్‌ మండలం కొడిమి పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీలో దాదాపు రూ.2.5 కోట్ల వ్యయంతో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మిస్తున్నారు. నెలాఖరులోపు నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేనున్నారు. ఈ సబ్‌స్టేషన్‌ నుంచి అనంతపురం రూరల్‌ మండలం కొడిమి, ప్రజా చైతన్యకాలనీ, జర్నలిస్టు కాలనీ, నరసనాయనికుంట, ఎ.నారాయణపురం, కూడేరు మండలం గొటుకూరు, బ్రాహ్మణపల్లి, రామచ్రందాపురం, లెప్రసీ కాలనీ తదితర గ్రామాల గృహ, వ్యవసాయ కనెక్షన్లకు అంతరాయం లేకుండా విద్యుత్‌ అందనుంది.

Advertisement
Advertisement