No Headline

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న రోగులు - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద అందించే వైద్య సేవల వ్యయం త్వరలోనే భారీగా పెరగనుంది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ప్రీమియం త్వరలోనే భారీగా పెరగనుంది. మొన్నటి వరకు ఒక కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల దాకా ఉన్న ఆరోగ్యశ్రీ చికిత్సల వ్యయ పరిమితి ఇప్పుడు రూ.25లక్షలకు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 18న నూతన మార్గదర్శకాలు వెలువడనున్నాయి. దీంతో సామాన్యులు, పేదవాళ్లు, కూలీలు ఎవరైనా సరే ఎంత పెద్ద జబ్బు చేసినా ఉచితంగా వైద్యం పొందచ్చు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పురుడు పోసుకున్న ఈ పథకం ఇప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్టు పాతిక లక్షల రూపాయల వ్యయ పరిమితికి చేరుకుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాజా అంచనాల ప్రకారం 44 లక్షల వరకు జనాభా ఉంది. ఇందులో వార్షికాదాయం 5 లక్షల లోపు ఉన్నవాళ్లందరూ లబ్ధిపొందచ్చు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో కనీసం 35 లక్షల మంది వరకూ లబ్ధి పొందే అవకాశం ఉంది.

పెద్ద జబ్బులొచ్చినా.. ఆందోళన వద్దు

చికిత్సలకు ఇచ్చే ప్రీమియం పెంచడం వల్ల ఇకపై పెద్ద పెద్ద జబ్బులొచ్చినా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఒక్కోసారి క్యాన్సర్‌, బోన్‌మ్యారో వంటి జబ్బులకు రూ.15 లక్షల వరకు అవుతుంది. ఇలాంటి కేసుల్లో పేదవాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై ఎంత పెద్ద జబ్బు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆరోగ్య చికిత్సల్లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, బోన్‌మ్యారో, కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ వంటి ఖరీదైన జబ్బులు ఉచితంగానే జరుగుతున్నాయి. ఇకపై ఇంతకంటే ఎక్కుక వ్యయం అయినా ప్రభుత్వమే భరిస్తుంది. వ్యవసాయాధారిత జిల్లాగా పేరుపొందిన ఇక్కడ ఎక్కువగా వ్యవసాయ కూలీలే ఉన్నారు. వీరికి ఇప్పుడు సర్కారు మరింత భరోసా కల్పించినట్టయింది.

పెరిగిన లబ్ధిదారుల సంఖ్య

అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో గతంలో ఏటా 25 వేలకు మించి ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు నమోదయ్యేవారు కాదు. కానీ గడిచిన నాలుగేళ్లలో సగటున ఏడాదికి 95 వేల మంది ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్స చేయించుకున్నారు. చికిత్సల సంఖ్య 1,059 నుంచి 3,257కు పెంచడంతో అన్ని జబ్బులకూ వైద్యం లభిస్తోంది. దీనికి తోడు ఇప్పుడు ప్రసవాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చడంలో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్క గర్భిణులే ఏటా 40వేల మందికి పైగా ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందుతున్నారు. అంతేకాదు కోలుకునే సమయంలో రోజుకు రూ.225 చొప్పున గరిష్టంగా నెలకు రూ.5వేలు పొందుతున్నారు. దేశ చరిత్రలో ఏపీలోనే ఇలాంటి పథకం అమలవుతోంది.

పెద్ద జబ్బులకూ ఉచిత చికిత్స

ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో ఇప్పటికే అన్ని రకాల పెద్ద పెద్ద జబ్బులకూ వైద్యం ఉచితంగా లభిస్తోంది. సర్కారు తాజా నిర్ణయంతో ఎంత పెద్ద జబ్బుకై నా చికిత్స చేయించుకునేందుకు అర్హత లభిస్తుంది. దీంతో ప్రాణాపాయ జబ్బు వచ్చినా సామాన్యులు భయపడాల్సిన పనిలేదు. – డా.కిరణ్‌కుమార్‌రెడ్డి,

ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌

ఆరోగ్యసిరి

ప్రజారోగ్యానికి జగన్‌ సర్కారు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఖరీదైన వైద్యాన్ని సైతం ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించి రోగులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందు కోసం ఇప్పటి వరకు ఉన్న వైద్య సేవల కోసం ప్రభుత్వం వెచ్చించే వ్యయాన్ని ఐదు రెట్లకు పెంచి సామాన్య ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తోంది.

ప్రజారోగ్యానికి ప్రాధాన్యత

ఆరోగ్యశ్రీ వ్యయం భారీగా పెంపు

రూ.25 లక్షలకు పెరిగిన పరిమితి

ఈ నెల 18న నూతన మార్గదర్శకాలు

సర్కారు నిర్ణయంతో సామాన్యుల్లో మరింత ధైర్యం

టీడీపీ హయాంతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో మూడు రెట్లు పెరిగిన లబ్ధిదారులు

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top