ఎస్‌ఆర్‌ఐటీ విద్యార్థికి డీజీ కమెండేషన్‌ అవార్డు

ఆశ్రిత   - Sakshi

బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురం వద్ద ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ (అటానమస్‌) కళాశాలలో సీఎస్‌ఎం తృతీయ సంవత్సరం విద్యార్థిని, ఎన్‌సీసీ క్యాడెట్‌ ఆశ్రితకు డీజీ కమెండేషన్‌ అవార్డు దక్కింది. 2024, జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్ర, తెలంగాణ ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌, ఎయిర్‌ కమాండర్‌ వి.ఎం.రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును ఆమె అందుకోనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బాలకృష్ణ సోమవారం వెల్లడించారు. లెప్ట్‌నెంట్‌ కల్నల్‌ సుమిత నేతృత్వంలో శిక్షణ పొందిన ఆశ్రిత.. రాయ్‌పూర్‌లోని లఖోలీలో జరిగిన అడ్వాన్స్‌ లీడర్‌ షిప్‌ శిక్షణా శిబిరంలో కనబరిచిన అత్యంత ప్రతిభకు అవార్డు దక్కినట్లు వివరించారు.

అంతర్జాతీయ సదస్సులో

అనంత వైద్యుడి ప్రసంగం

అనంతపురం మెడికల్‌: అత్యంత ఆధునిక రోబోటిక్‌ శస్త్ర చికిత్సల ఆవిష్కరణపై ‘రొబోకాన్‌–2023’ పేరుతో హైదరాబాద్‌లో రెండ్రోజులుగా జరిగిన అంతర్జాతీయ సదస్సులో నార్పలకు చెందిన డాక్టర్‌ కార్తీక్‌ ప్రసంగం ఆకట్టుకుంది. కర్నూలు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌, ఉస్మానియాలో ఎంఎస్‌ ఆర్థోపెడిక్‌ పూర్తి చేసిన ఆయన రోబోటిక్‌ టెక్నాలజీలో వచ్చే చిక్కులు, గాయం తక్కువగా ఉండి ఎముకలను సరిచేయడం వంటివాటిపై ప్రసంగించారు. మోకాలి శస్త్రచికిత్సల కోసం అందుబాటులో ఉన్న ఐదు రకాల రోబోటిక్‌ పద్ధతులను ఒకేచోట చేర్చి వివరించారు. డాక్టర్‌ కార్తీక్‌ మాట్లాడుతూ ఇలాంటి సదస్సుల్లో పాల్గొనే అవకాశం రావడం వల్ల కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటు రోగులకు మరింత మెరుగైన, అత్యాధునిక వైద్యం ఎలా చేయాలో అవగాహన కలుగుతుందని అన్నారు.

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top