నేటి నుంచి పంట నష్టం అంచనాలు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పంట నష్టం అంచనాలు

Published Sat, Nov 18 2023 9:06 AM

కంబదూరులో దెబ్బతిన్న వేరుశనగ  - Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు నెలకొన్న జిల్లాలోని 28 మండలాల్లో శనివారం నుంచి పంట నష్టం అంచనాలు రూపొందించనున్నట్లు వ్యవసాయశాఖ జిల్లా కార్యాలయం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటిస్తూ గత అక్టోబర్‌ 31న విడుదల చేసిన జీవో 4 ప్రకారం ఈ–క్రాప్‌ ఆధారంగా ఆయా మండలాల్లో 33 శాతం కన్నా ఎక్కువగా నష్టం జరిగిన పంట వివరాలు నమోదు చేస్తామని పేర్కొంది. ఇందుకోసం గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కమిటీలు వేసినట్లు తెలిపింది. ఈ నెల 20లోపు పంటనష్టం అంచనాలు పూర్తి చేస్తామని, 21 నుంచి 25వ తేదీ వరకు ఆర్‌బీకే వేదికగా సామాజిక తనిఖీలు నిర్వహించి, అభ్యంతరాలు ఉంటే రైతుల నుంచి స్వీకరిస్తామని వెల్లడించింది. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి 27వ తేదీ నాటికి సమగ్ర కరువు నివేదిక తయారు చేస్తామని ప్రకటించింది. సమగ్ర నివేదికను మరోసారి పరిశీలించి పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ) కోసం కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపింది.

1.86 లక్షల హెక్టార్లలో పంట నష్టం

ఖరీఫ్‌–2023లో వర్షాభావం వల్ల జిల్లా వ్యాప్తంగా 1.86 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఇందులో వేరుశనగ 78,915 హెక్టార్లు, కంది 45,526, పత్తి 26,080, ఆముదం 22,859, మొక్క జొన్న 6,873, సజ్జ 1,765, కొర్ర 1,701, జొన్న 1,147, ఉలవ 704, పొద్దుతిరుగుడు 252, పెసర 255, మినుము 251, అలసంద 158, సోయాబీన్‌ 144 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు నమోదు చేసింది.

పంట నష్ట పరిహారం ఇలా...

ఇన్‌పుట్‌ సబ్సిడీ నిబంధనల మేరకు గరిష్టంగా రెండు హెక్టార్లు పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకుంటామని వ్యవసాయ శాఖ తెలిపింది. వేరుశనగ, పత్తి పంటలకు సంబంధించి స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ (పంటనష్ట ఉపశమనం) హెక్టారుకు రూ.17 వేలు, జొన్న, సజ్జ, ఆముదం పంటలకు రూ.8,500, కంది, ఇతర ఆపరాలు, పొద్దుతిరుగుడు, సోయాబీన్‌ పంటలకు రూ.10 వేలు, మొక్క జొన్నకు రూ.12,500 వర్తిస్తుందని పేర్కొంది.

Advertisement
 
Advertisement