నవజాత శిశు కేంద్రం పనులు వేగవంతం

- - Sakshi

అనంతపురం మెడికల్‌: పసికందులకు మరింత నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఏర్పాటు చేయనున్న మరో నవజాత శిశు కేంద్రం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. సర్వజనాస్పత్రిలోని కాన్పుల వార్డు పక్కన ఉన్న నవజాతా శిశు కేంద్రం పై అంతస్తులో 20 పడకల సామర్థ్యంతో మరో కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రంలో ఇన్‌బార్న్‌, ఔట్‌బార్న్‌, మదర్స్‌ ఫీడింగ్‌ రూం, వైద్యుల గది, తదితర వాటి పనులు పూర్తయ్యాయి. మొత్తం 9 అమర్చారు. ఇటీవల ఆస్పత్రి మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు రూ.3.5 కోట్లు కేటాయించిన విషయం విదితమే. ఆ నిధుల నుంచి రూ.7 లక్షల వరకు ఆక్సిజన్‌, గ్యాస్‌ పైప్‌లైన్‌, మదర్స్‌ రూం కోసం వెచ్చించారు. ఈ లెక్కన గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.35 లక్షలు కలుకుని మొత్తం రూ.42 లక్షలతో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నూతన నవజాతా శిశు కేంద్రాలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అందులో అనంతపురం సర్వజనాస్పత్రిలోని నూతన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారని తెలిసింది.

టీబీ డ్యాంకు స్వల్పంగా పెరిగిన ఇన్‌ఫ్లో

బొమ్మనహాళ్‌: తుంగభద్ర జలాశయం (టీబీ డ్యాం)లో ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగింది. ఈ నెల 9న 0 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో రెండు రోజులుగా పునః ప్రారంభమై శనివారం ఉదయం 6,465 క్యూసెక్కులకు పెరిగింది. డ్యాం ఎగువ భాగంలో వర్షాలు కురవడంతో వరద పెరుగుతోంది. 105.788 టీఎంసీల పూర్తి సామర్ధ్యం ఉన్న జలాశయంలో ప్రస్తుతం 25.402 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి స్ధాయి నీటి మట్టం 1,633 అడుగు కాగా, ప్రస్తుతం 1,602.83 అడుగుల నీటి మట్టం నమోదైంది. జలాశయం నుంచి 8,512 క్యూసెక్కుల నీరు రైట్‌ బ్రాంచ్‌ మొయిన్‌ కెనాల్‌, లెఫ్ట్‌ బ్రాంచ్‌ మొయిన్‌ కెనాల్‌కు సంబంధించి వివిధ కాలువలకు విడుదల చేస్తున్నారు. ఇందులో ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు 2,898 క్యూసెక్కులు వదులుతుండగా ఆంధ్రా సరిహద్దులోని 105వ కిలోమీటర్‌ వద్ద 1,857 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top